Telugu Global
NEWS

బుద్ధవనం సందర్శనకు థాయిలాండ్ బౌద్ధ బిక్షువుల ఆసక్తి

సదస్సులో భాగంగా స్థానిక బౌద్ధాలయాలను సందర్శించిన ఆయన, గోల్డెన్ బుద్ధ ఆలయంలోని బౌద్ధ భిక్షులకు కలిసి ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రదేశంలో నిర్మించిన బుద్ధవనం బ్రోచర్‌ను వారికి అందించి, సందర్శించవలసిందిగా ఆహ్వానించారు.

బుద్ధవనం సందర్శనకు థాయిలాండ్ బౌద్ధ బిక్షువుల ఆసక్తి
X

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోని వాట్ త్రెమిట్‌లో గ‌ల ఫ్ర బుద్ధ మహా సువర్ణ ప్రతిమాకర బౌద్ధాలయ భిక్షులను బుద్ధవనం బుద్ధిష్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్, సీఈఓ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, డా.ఈమని శివనాగిరెడ్డి ఆహ్వానించారు. స్థానిక మహారాణి సిరికిటి నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న పసిఫిక్ ఆసియా ట్రావెల్ ఏజెన్సీ (పాటా) 50వ సమావేశానికి ఆయన తెలంగాణ పర్యాటకశాఖ ప్రతినిధిగా హాజరయ్యారు. పాటా సమావేశ ప్రదర్శనశాలలో తెలంగాణ పర్యాటక శాఖ, పర్యాటక అభివృద్ధి సంస్థ వెల్కమ్ టు బుద్ధవనం పేరిట ఏర్పాటు చేసిన స్టాల్ ను తెలంగాణ పర్యాటక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు ప్రారంభించారని, తెలంగాణ స్టాల్ ను ఇప్పటివరకు 800 మంది అంతర్జాతీయ పర్యాటక సంస్థల ప్రతినిధులు సందర్శించారని, వారికి తెలంగాణ పర్యాటక కేంద్రాలతో పాటు, నాగార్జునసాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకతలను శివనాగిరెడ్డి వివరించారు.

సదస్సులో భాగంగా స్థానిక బౌద్ధాలయాలను సందర్శించిన ఆయన, గోల్డెన్ బుద్ధ ఆలయంలోని బౌద్ధ భిక్షులకు కలిసి ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రదేశంలో నిర్మించిన బుద్ధవనం బ్రోచర్‌ను వారికి అందించి, సందర్శించవలసిందిగా ఆహ్వానించారు. గోల్డెన్ బుద్ధ ఆలయ వాస్తు, శిల్పానికి మంత్రముగ్ధుడైన శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. క్రీ.శ 13వ శతాబ్దిలో సుఖతోయ్ రాజులు నిర్మించిన ఈ బంగారు బుద్ధుని విగ్రహం భారతీయ ప్రతిమా లక్షణాలతో అలరారుతుందని అన్నారు. క్రీ.శ. 1403లో బ్యాంకాక్ ప్రాంతానికి ఈ విగ్రహం తరలించబడిందనీ, బర్మా దేశీయుల దాడి నుంచి కాపాడుకోవడానికి స్థానిక ఆయుత్థాయ రాజవంశీయులు ఈ బంగారు విగ్రహంపై సున్నపు గారను పూసి, ఆయుత్థాయ బౌద్ధారామ శిథిలాల్లో దాచి పెట్టారన్నారు.

క్రీ.శ. 1891లో మొదటి రామునిగా బిరుదాంకితుడైన బుద్ధ యోధ చూలలోకే అనే సియాం రాజు, బ్యాంకాక్ నగరానికి తరలించగా, ఆ విగ్రహాన్ని మూడో రాముడు ఆసియాటిక్ ప్రాంతానికీ, 1935లో తర్వాతి పాలకులు ప్రస్తుత ఆలయ ప్రాంగణానికి తరలించి, సున్నపు గారను తొలగించి, మళ్లీ బంగారు ప్రతిమను, నగిసషీగావించారని చెప్పారు. బంగారు బుద్ధ ఆలయ సందర్శనలో తెలంగాణ పర్యాటక శాఖ ప్రతినిధులు మహేష్, ఎస్ఈ సరిత, ప్రభాకర్ పాల్గొన్నట్టు శివనాగిరెడ్డి తెలిపారు.

First Published:  29 Aug 2024 5:00 AM GMT
Next Story