Telugu Global
National

బీహార్ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత.. లడ్డూలు విసిరిన సభ్యులు

అసెంబ్లీ ఆవరణలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు పంచిపెట్టిన లడ్డూలను బీజేపీ ఎమ్మెల్యేలు వారిపైనే విసిరారు. దీంతో అసెంబ్లీ ఆవరణ వద్ద రెండు పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

బీహార్ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత.. లడ్డూలు విసిరిన సభ్యులు
X

అసెంబ్లీ ఆవరణలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరినొక‌రు తిట్టుకోవడం, గొడవ పడటం చూశాం. అయితే లడ్డూలు విసురుకోవడం ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఆవరణలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. అసెంబ్లీ ఆవరణలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు పంచిపెట్టిన లడ్డూలను బీజేపీ ఎమ్మెల్యేలు వారిపైనే విసిరారు. దీంతో అసెంబ్లీ ఆవరణ వద్ద రెండు పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె ఎంపీ మీసా భారతికి ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బెయిల్ వచ్చింది. ఒక్కొక్కరికి రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో లడ్డూలు పంచిపెట్టారు.

ఇదిలా ఉండగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు పంపిణీ చేసిన లడ్డూలను వారిపైనే విసిరికొట్టారు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకరినొకరు దూషించుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా బీహార్ ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ ఆర్జేడీ ఎమ్మెల్యేలు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు చేశారు. తమపై గుండాయిజం చూపించారని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో తమ పట్ల ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ సభ్యులతో గొడవకు దిగారని పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ ఆరోపించారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు లడ్డూలు విసురుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

First Published:  15 March 2023 12:54 PM GMT
Next Story