Telugu Global
Health & Life Style

అతి ఆవలింతలు... ప్రమాదమా?

పావుగంటలోనే మూడుసార్లకంటే ఎక్కువగా ఆవలిస్తే అది శరీరంలో ఏదైనా సమస్యకు సంకేతంగా భావించాలని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

అతి ఆవలింతలు... ప్రమాదమా?
X

అతి ఆవలింతలు... ప్రమాదమా?

ఆవలింతకు అన్న ఉంటాడనే సామెత ఉంది. ఎవరైనా ఆవలించగానే మనకు కూడా వచ్చేస్తుంది కదా. కొంతమందికి ఆవలింతలు మరింత ఎక్కువగా వస్తుంటాయి. సాధారణంగా అలసట లేదా బోర్ ఫీలవటం వలన ఆవలింతలు వస్తుంటాయి. ఆవలింతతో కొన్ని రకాల హార్మోన్లు విడుదల అవుతాయి. వాటి కారణంగా గుండె కొట్టుకునే వేగం కొద్దిగా పెరుగుతుందని, మనం అప్రమత్తంగా మారతామని సౌత్ కరోలినా మెడికల్ యూనివర్శిటీ వెల్లడించింది. మనం అలసటగా ఉన్నపుడు లేదా బోర్ ఫీలవుతున్నపుడు మన శరీరం మనల్ని అప్రమత్తం చేసే ఒక ప్రక్రియగా ఆవలింతని చెప్పవచ్చు. ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప ఆవలింతని అత్యంత సాధారణమైన శారీరక చర్యగానే పరిగణించాలి. అయితే పావుగంటలోనే మూడుసార్లకంటే ఎక్కువగా ఆవలిస్తే అది శరీరంలో ఏదైనా సమస్యకు సంకేతంగా భావించాలని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. తరచుగా ఆవలింతలు వస్తుంటే... ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది.

ఆవలింతలు ఎక్కువైతే...

నిద్రలేమి కావచ్చు...

చాలా తరచుగా ఆవలింతలు వస్తుంటే అది నిద్రలేమికి సూచన కావచ్చు. సాధారణంగా ఏదైనా శారీరక మానసిక సమస్య ఉన్నపుడు మనం నిద్ర లేమి లేదా స్లీప్ అప్నియాకు గురవుతుంటాం. కనుక ఆవలింతలు తరచుగా వస్తుంటే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి. స్లీప్ ఆప్నియా అనేది చాలా తీవ్రమైన స్లీప్ డిజార్డర్. దీనికి గురయిన వారు నిద్రలో గురక పెడతారు. దాంతో శ్వాస పదేపదే ఆగిపోయి తిరిగి మొదలవుతుంటుంది. చాలా ఎక్కువ గురక పెట్టటమే కాకుండా, రాత్రంతా నిద్రపోయినా తెల్లవారి అలసిపోయినట్టుగా ఉంటే స్లీప్ అప్నియా ఉన్నదని అనుమానించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మందుల వలన ఆవలింత...

కొన్నిరకాల మందుల వలన విపరీతమైన ఆవలింతలు వస్తుంటాయి. యాంటీ సైకోటిక్స్ లేదా యాంటీ డిప్రెసెంట్ మందులు వాడినప్పుడు వాటి సైడ్ ఎఫెక్టుగా విపరీతమైన ఆవలింతలు వచ్చే అవకాశం ఉంది. వైద్యుల సలహా లేకుండా ఇలాంటి మందులు వాడకూడదు. అలాగే వైద్యులు చెప్పిన విధంగానే వాటిని వాడాలి. అలా చేసినా ఆవలింతలు వస్తుంటే వైద్యుల సలహా తీసుకోవాలి.

మెదడు రుగ్మత

ఆవలింతలు విపరీతంగా వస్తుంటే అది మెదడు సమస్యకు సూచన కూడా కావచ్చు. పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మైగ్రేన్ తలనొప్పులు వంటివి ఉన్నా ఆవలింతలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

ఆందోళన, ఒత్తిడి

ఈ రెండింటి వలన కూడా ఆవలింతలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారిలో టెన్షన్ ని తగ్గించే ప్రక్రియగా ఆవలింతలు వచ్చే అవకాశం ఉంది.

గుండెపోటు వలన కూడా...

ఆవలింతల వెనుక ఈ కారణం కూడా ఉండే అవకాశం ఉంది. హార్ట్ ఎటాక్ కి గురయినవారిలో శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దాంతో ఆవలింతలు రావచ్చు. అయితే గుండె పోటు వచ్చినప్పుడు ఇతర లక్షణాలు సైతం చాలా ఉంటాయి కనుక... ఆవలింతలు రాగానే హార్ట్ ఎటాక్ కావచ్చని భయపడిపోనక్కర్లేదు.

First Published:  15 July 2023 1:55 PM IST
Next Story