చలికాలం గొంతు సమస్యలకు చెక్ పెట్టండిలా
Winter Throat Problems in Telugu: చలికాలం వస్తూనే కొన్ని కొత్త వ్యాధుల్ని తీసుకొస్తుంది. అందులో గొంతు ఇన్ఫెక్షన్లు ముఖ్యమైనవి. చలికాలంలో చాలామందిని గొంతు సమస్యలు వేధిస్తుంటాయి.
చలికాలం వస్తూనే కొన్ని కొత్త వ్యాధుల్ని తీసుకొస్తుంది. అందులో గొంతు ఇన్ఫెక్షన్లు ముఖ్యమైనవి. చలికాలంలో చాలామందిని గొంతు సమస్యలు వేధిస్తుంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో వాటికి చెక్ పెట్టొచ్చు. అదెలాగంటే..
చలికాలం మొదలవగానే వాతావరణంలో వచ్చిన మార్ప కారణంగా దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం లాంటివి వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చల్లని పదార్థాలు తీసుకోవడం మానేయాలి. గోరువెచ్చటి నీటితో తరచూ పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది. గొంతు వాపు తగ్గుతుంది.
పసుపులో యాంటీబ్యాక్టీరియా గుణాలు ఉంటాయి. కాబట్టి పసుపు కలిపిన పాలు తాగడం వల్ల కూడా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే నల్ల మిరియాలను తేనెతో కలిపి తీసుకుంటే ఛాతీలో పేరుకుపోయిన కఫం నయమవుతుంది.
విటమిన్ సి నిండిన పండ్లను తినడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీ హిస్టమైన్ ఎలర్జీలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే చలికాలంలో నిమ్మ, నారింజ, జామ కాయలు లాంటివి తినాలి.
దగ్గు, జలుబు లేదా గొంతులో నొప్పి అనిపిస్తే ఖచ్చితంగా వేడి నీటి ఆవిరిని పట్టుకోవాలి. నీటి ఆవిరి తీసుకోవడం వల్ల గొంతు, ముక్కులో ఇన్‌ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లంతో గొంతునొప్పికి చెక్ పెట్టొచ్చు. రోజూ ఉదయాన్నే అల్లంతో చేసిన టీ తాగడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే తులసి, లవంగం, గ్రీన్ టీ, హెర్బల్ టీలు తాగడం వల్ల చలికాలంలో గొంతు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.