Telugu Global
Health & Life Style

చలికాలంలో మహిళలు ఈ ఆహార పదార్థాలు తీసుకోవాలి.. డైటీషియన్లు చెప్తున్న ఆ ఫుడ్స్ ఏంటంటే..

చలి కాలంలో తేమతో కూడిన గాలుల వల్ల వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. మహిళలకు సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

చలికాలంలో మహిళలు ఈ ఆహార పదార్థాలు తీసుకోవాలి.. డైటీషియన్లు చెప్తున్న ఆ ఫుడ్స్ ఏంటంటే..
X

మానవ శరీరానికి సమతుల్యమైన ఆహారం లభించాలంటే.. సీజన్ల వారీగా తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. ఇంటి పనులు, ఉద్యోగాలతో త్వరగా అలసిపోయే మహిళలు చలికాలంలో ఎక్కువగా జలుబు, ఫ్లూతో బాధపడుతుంటారు. అంతే కాకుండా కీళ్ల నొప్పులు, జుట్టు రాలిపోవడం, పొడి చర్మం, తామర వంటి సమస్యలు శీతాకాలంలో వస్తుంటాయి. చల్లటి గాలుల కారణంగా కీళ్ల నొప్పులు అధికమవుతుంటాయి. బట్టలు ఉతకడం, అంట్లు తోమడం వంటి పనులతో నిత్యం నీళ్లు, తడితో చేతులు కాళ్లు ఉంటాయి. దీని వల్ల చర్మం కూడా పొడిబారుతుంది.

చలి కాలంలో తేమతో కూడిన గాలుల వల్ల వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. మహిళలకు సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇక చలికాలంలో అయితే ఇది వారి శరీరంపై మరింత ప్రభావం చూపిస్తుంది. అందుకే సీజన్‌కు అనుగుణంగా మహిళలు ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు చెప్తున్నారు. తీసుకునే ఆహారం శరీరానికి వెచ్చదనం ఇచ్చేలా చూసుకోవాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా.. చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. డైటీషియన్స్ సూచిస్తున్న ఆ ఆరు రకాల ఆహార పదార్థాలు ఏమిటో ఒక సారి పరిశీలిద్దాం.

ఉసిరి : ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా పిలిచే ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక ఉసిరికాయ తినడం వల్ల ఎంతటి కఠినమైన వాతావరణ పరిస్థితులను అయినా ఎదుర్కునే శక్తి వస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోకుండా చూసి.. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

నెయ్యి : చాలా మంది మహిళలు నెయ్యి తినడానికి ఆసక్తి చూపించరు. నెయ్యి తీసుకుంటే శరీరంలో కొవ్వు చేరి, లావు అయిపోతామనే భయం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. ఆవు పాలతో చేసిన నెయ్యిని చలికాలంతో తీసుకుంటే శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు. పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన కొవ్వు కాబట్టి లావు అయ్యే పరిస్థితి కూడా ఉండదు. ప్రతీ రోజు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఆహారంలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు.

బెల్లం : శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తాటి బెల్లం శరీరానికి మంచింది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల మధుమేహం ఉన్న వాళ్లు కూడా దీన్ని పరిమితంగా తీసుకోవచ్చు. బెల్లం అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో బెల్లం ఉపయోగపడుతుంది. చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఉపయోగించడం మంచింది.

పల్లీ చిక్కీ : వేరు శెనగ చిక్కీ లేదా పల్లీ పట్టి చాలా రుచికరమైన తినుబండారం. బెల్లంతో చేసే ఈ చిక్కీని తినడం వల్ల మహిళలకే కాకుండా పిల్లలకు, పురుషులకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. రక్త హీనత సమస్య నుంచి వేరు శెనగ చిక్కీ దూరం చేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో ఎక్కువే. చర్మ సంరక్షణకు చిక్కీ చక్కగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక పెంచి, వైరస్‌లు దాడి చేయకుండా ఈ ఆహారం కాపాడుతుంది. జీర్ణ శక్తి పెంచడమే కాకుండా, బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది.

పంజరి : బెల్లంలో అనేక రకాల గింజలను కలిపి చేసే తీపి పదార్థం ఇది. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా జలులు, దగ్గు నుంచి దూరం చేస్తుంది. నెయ్యితో కలిపి లడ్డూల రూపంలో తీసుకుంటే మహిళలకు ప్రయోజనం ఉంటుంది.

శొంఠి : టీలో వేసుకొని లేదా వేడి నీటిలో నాన బెట్టి దాన్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుంది. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే దీన్ని తమ ఆహారంలో భాగం చేసుకోవడం అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

First Published:  16 Nov 2022 10:57 AM GMT
Next Story