ఖాళీ కడుపుతో కాఫీ టీలు తాగితే
చాలామంది ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగుతుంటారు. టీ కాఫీలతోనే వారి రోజు మొదలవుతుంది.

ఖాళీ కడుపుతో కాఫీ టీలు తాగితే
చాలామంది ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగుతుంటారు. టీ కాఫీలతోనే వారి రోజు మొదలవుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే టీ కాఫీల వలన కొన్ని లాభాలు ఉన్నమాట నిజమే అయినా... వాటిని రోజులో మొదటి ఆహారంగా తీసుకోవటం మంచిది కాదంటున్నారు వైద్యులు. అందుకు గల కారణాలేమిటో తెలుసుకుందాం
-టీలో శరీరంలోని నీటిని తొలగించే లక్షణాలు ఉంటాయి. రాత్రంతా మనం నీటిని తాగకుండా ఉండి ఉదయాన్నే టీ తాగటం వలన శరీరం డీహైడ్రేషన్ గురయ్యే అవకాశం పెరుగుతుంది. అలాగే ఇలా తాగటం మలబద్దకానికి కూడా దారితీస్తుంది.
-టీ కాఫీలు ఎసిడిక్ లక్షణాన్ని కలిగి ఉంటాయి కనుక ఖాళీ కడుపుతో వీటిని తాగినప్పుడు పొట్టలోని యాసిడ్ కి సంబంధించిన బేసిక్ బ్యాలన్స్ కి అంతరాయం కలిగి ఎసిడిటీ, అజీర్తి కుగుతాయి.
-నిద్రలేవగానే మొహం కడగకుండా టీ లేదా కాఫీ టీ తాగినప్పుడు నోట్లోని బ్యాక్టీరియా టీ కాఫీల్లోని పంచదారని విచ్ఛిన్నం చేయటం వలన నోట్లో యాసిడ్ స్థాయి పెరిగి పళ్లపైన ఉండే రక్షణపొర ఎనామిల్ దెబ్బతింటుంది.
- ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ కాఫీలు తాగటం వలన కొంతమందికి పొట్ట ఉబ్బరం, గుండెల్లో మంట, అల్సర్ నొప్పి పెరగటం లాంటి సమస్యలు వస్తాయి. కెఫిన్ ఉన్న పానీయాల్లోని యాసిడ్ తత్వం పొట్టలోని జీర్ణవ్యవస్థలోని యాసిడ్స్ తో కలవటం వలన అలా జరుగుతుంది.
-టీలో ఉన్న టానిన్... మనం తినే ఆహారంలోని ఇనుముని మన శరీరం తీసుకోకుండా ఆపుతుంది. అలాగే టీలో ఉండే కెఫిన్ కూడా ఆహారంలోని పోషకాలను మన శరీరం శోషించుకోకుండా చేస్తుంది.
మరేం చేయాలి?
ఉదయాన్నే టీకి తాగే అలవాటున్నవారు టిఫిన్ తో పాటు టీని తాగటం మంచిది. అలాగే మధ్యాహ్న భోజనం తరువాత గంటనుండి నుండి రెండుగంటల విరామం తీసుకుని తాగవచ్చు. సాయంత్రం పూట చిరుతిండితో పాటు టీని తాగటం సరైన విధానమని చెప్పవచ్చు. టీకి ముందు కొన్ని నట్స్ ని తినటం వలన కూడా సమస్యలు తగ్గుతాయి. టీ తాగేందుకు మంచి సమయం మధ్యాహ్నం మూడు గంటలు. ఈ సమయంలో టీ తాగటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచుగా జలుబు చేయటం తగ్గుతుంది.
కాఫీనిసైతం ఉదయాన్నే ఏమీ తినకుండా తాగటం మంచిది కాదు. మన శరీరంలో ఒత్తిడి హార్మోను కార్టిసాల్ స్థాయి ఉదయం ఎనిమిది తొమ్మిది మధ్య, మధ్యాహ్నం పన్నెండు ఒంటిగంట మధ్య, సాయంత్రం ఐదున్నర ఆరున్నర మధ్య హెచ్చుగా ఉంటుంది. ఈ సమయాల్లో కాఫీ తాగకూడదని, వీటి మధ్య సమయాల్లో తాగటం మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు ఉదయం తొమ్మిదిన్నర, పదకొండున్నర మధ్య తాగవచ్చు. సాధారణంగా వ్యాయామానికి ముందు కాఫీ తాగమని చెబుతుంటారు. ఇలా చేయటం వలన వ్యాయామానికి తగిన శక్తి పెరగటంతో పాటు అదనపు కేలరీలు సైతం ఖర్చు అవుతాయట.
ఉదయాన్నే తాగాల్సిన పానీయాలు
-ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చిటికెడు ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగవచ్చు. ఇది బరువుని తగ్గిస్తుంది... రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
-రాత్రులు ఒక గ్లాసునీటిలో ఒక స్పూను మెంతులు లేదా సోంపు లేదా జీలకర్ర నానబెట్టి ఉదయాన్నే నీటిని వడబోసుకుని వెచ్చపెట్టుకుని తాగాలి.
-గోరువెచ్చని నీటిలో అర టేబుల్ స్పూను అవిసె గింజల పొడిని కలుపుకుని తాగితే అది అద్భతమైన, ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంటు గా పనిచేస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది.