దేశంలో సగంమంది ఒళ్లు వంచడం లేదు! ఎదురయ్యే నష్టాలివే!
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో మనదేశంలో సుమారు సగం మందికి కనీస శారీరక శ్రమ ఉండడం లేదని తెలిసింది.
రోజుకు కొంతైనా శారీరక శ్రమ లేకపోతే రకరకాల అనారోగ్యాలు చుట్టుముడతాయని డాక్టర్లు పదేపదే చెప్తుంటారు. అయినా మనదేశంలో సుమారు సగం మంది అసలు ఒళ్లే వంచడం లేదట. రీసెంట్‌గా జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైన విషయం ఇది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో మనదేశంలో సుమారు సగం మందికి కనీస శారీరక శ్రమ ఉండడం లేదని తెలిసింది. దేశంలోని మగవాళ్లలో 42 మంది, ఆడవాళ్లలో 57 శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారట. దీనివల్ల ఒబెసిటీ, డయాబెటిస్ వంటి పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. దీన్ని ఎలా ఎదర్కోవచ్చంటే..
రానురాను వ్యాయామం చేసేవాళ్ల సంఖ్య తగ్గుతూ వస్తోందట. మరో పదేళ్లకి శారీరక శ్రమ లేని వారి శాతం 60 శాతానికి పెరిగే అవకాశమున్నట్టు స్టడీలు చెప్తున్నాయి. దీనివల్ల బరువు పెరగడం, డయాబెటిస్, బీపీ సమస్యలతో పాటు గుండె సమస్యలు, హై కొలెస్ట్రాల్, మెటబాలిక్ సిండ్రోమ్స్, ఎముకలు, కీళ్ల సమస్యలు, జీర్ణ సమస్యలు, థైరాయిడ్ సమస్యలతో పాటు డిప్రెషన్, యాంగ్జయిటీ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది.
ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటేనే శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యమూ సమకూరుతుంది. ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజుకి కనీసం ఇరవై నిముషాల పాటైనా హార్ట్ బీట్ పెరిగేలా ఏదైనా శ్రమ చేయాలి. రోజువారీ పనుల్లో శ్రమ ఉండని వాళ్లు తప్పకుండా వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. వ్యాయామాలు కుదరకపోతే వాకింగ్ అయినా చేయాలి.