Telugu Global
Health & Life Style

వేసవిలో జలుబు.. వింతేమి కాదు.. ఎందుకంటే

వేసవిలో జలుబు, దగ్గుకు ప్రధాన కారణం ఎలర్జీ, వైరస్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు.వేసవిలో బలమైన వేడి గాలులు వీస్తుండటంతో.. పుప్పొడి, ధూళి వంటి అలర్జీ కారకాలు శరీరంలోకి చేరితే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది.

వేసవిలో జలుబు.. వింతేమి కాదు.. ఎందుకంటే
X

ఈ సారి ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపం రోజురోజుకి హద్దులు దాటుతోంది. పెరుగుతున్న ఎండ వల్ల డీహైడ్రేషన్, ఎండ దెబ్బలాంటి రకరకాల ఆరోగ్య సమస్యలు రావటం మనకి తెలుసు. కానీ ఒక్కోసారి వేసవిలో జలుబు చేస్తుంది. వానాకాలంలో, శీతాకాలంలో జలుబు సాధారణమే. కానీ ఈ వేసవి కాలంలో జలుబు రావడమేంటి ? మరీ వింతగా అనుకోకండి. ఈ సమస్య చాలామందిని వేధిస్తోంది.

సాధారణంగా వాతావరణంలో మార్పులు, విపరీతమైన వేడి కారణంగా ఎండాకాలంలోనూ కొందరికి జలుబు చేసే అవకాశం ఉంది, అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సూక్ష్మజీవులు కూడా తమ స్వభావాన్ని మార్చుకుంటుండటం వల్ల వేసవిలో ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తున్నాయి. వేసవిలో జలుబు, దగ్గుకు ప్రధాన కారణం ఎలర్జీ, వైరస్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు.వేసవిలో బలమైన వేడి గాలులు వీస్తుండటంతో.. పుప్పొడి, ధూళి వంటి అలర్జీ కారకాలు శరీరంలోకి చేరితే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది.

వేసవి దెబ్బకి చాలా మంది ఎయిర్ కండిషన్ గదుల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇలా చేస్తే శరీరంలో డ్రైనెస్ పెరుగుతుంది. ముక్కు, చెవి మరియు నోరు పొడిబారతాయి. ఈ సమస్యకి వైరస్ తోడు అయినప్పుడు జలుబు, దగ్గు ఎంట్రీ ఇస్తాయి.. అలాగే అందరూ ఒకే ఏసీ గదిలో ఉంటాం కాబట్టి ఇంట్లో ఒకరికి జలుబు చేస్తే అది అందరికీ వ్యాపించే ప్రమాదం ఉంది.

వేసవి జలుబు నుంచి బయటపడాలి అంటే ముందు గోరువెచ్చని నీటిని తాగటం ప్రారంభించాలి. అలాగే గొంతు నొప్పి ఉపశమనం కోసం ఉప్పు నీటిని ఎక్కువ సార్లు పుక్కిలించాలి. ఆవిరి పట్టాలి. అలాగే విటమిన్-సీ, విటమిన్-కే అధికంగా ఉండే కూరగాయలు, ఆహారాలు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. తరచుగా చేతులను కడుక్కోవడం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా క్రిముల నుంచి రక్షణ పొందచ్చు. అలాగే రోజూ కనీసం 7-9 గంటల పాటు నిద్రపోవడం వల్ల కూడ శరీరం జబ్బుల నుంచి త్వరగా కోలుకుంటుంది.

First Published:  15 May 2024 9:36 AM IST
Next Story