Telugu Global
Health & Life Style

మైక్రో న్యూట్రిషన్ గురించి తెలుసా?

ప్రపంచంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యలకు సూక్ష్మ పోషకాల లోపమే కారణమని రీసెంట్‌గా జరిగిన ఓ స్టడీలో తేలింది.

మైక్రో న్యూట్రిషన్ గురించి తెలుసా?
X

ప్రపంచంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యలకు సూక్ష్మ పోషకాల లోపమే కారణమని రీసెంట్‌గా జరిగిన ఓ స్టడీలో తేలింది. ప్రపంచ జనాభాలో సుమారు 200 కోట్ల మంది సూక్ష్మపోషకాల లోపంతో బాధపడుతున్నారట. తద్వారా పలు అనారోగ్యాలకు లోనవుతున్నారు. అసలేంటీ మైక్రో న్యూట్రిషన్? ఇదెలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరానికి కావల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్ ను స్థూల పోషకాలని, మిగతా విటమిన్లు, మినరల్స్ ను సూక్ష్మ పోషకాలని అంటారు. శరీరానికి సూక్ష్మపోషకాలు చాలా తక్కువ మొత్తంలో అవసరమయినప్పటికీ వాటి ప్రాముఖ్యత మాత్రం చాలా ఎక్కువ. శరీర ఆరోగ్యంపై సూక్ష్మ పోషకాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరం ఎంజైమ్‌లు, హార్మోన్లను తయారు చేసుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు సూక్ష్మ పోషకాలు చాలా అవసరం.

ఆహారంలో అన్నం, బ్రెడ్, రొట్టెల వంటివి మాత్రమే ఉంటే సూక్ష్మ పోషకాలు అందవు. కాబట్టి వాటికోసం కాయగూరలు, స్పైసెస్, పండ్ల వంటివి తప్పక తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువగా ఉండే కాయగూరలు లేదా పండ్ల శాతాన్ని పెంచడం ద్వారా సూక్ష్మ పోషకాల లోపం రాకుండా చూసుకోవచ్చు. రోజుకి కనీసం 500 గ్రాముల కూరగాయలు, పండ్లు తినేలా చూసుకోవాలి. మనదేశంలో ఆహారంలో పండ్లు, కూరగాయల మోతాదు కేవలం 100 నుంచి 200 గ్రాములు మాత్రమే ఉంది. కాబట్టి ఈ మొతాదుని పెంచాలి.

అన్నిరకాల సూక్ష్మ పోషకాలు అందేందుకు రంగురంగుల ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోవాలి. ఆకుకూరలు, ఎర్రటి పండ్లు, పసుపు పండ్లు, దుంపలు ఇలా అన్నింటిని బ్యాలెన్స్‌డ్‌గా తీసుకుంటే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందుతాయి.

సూక్ష్మ పోషకాలు పొందడం కోసం మొలకెత్తిన విత్తనాలు బెస్ట్ ఆప్షన్. నాలుగైదు రకాల మొలకలను రోజూ ఒక కప్పు తినడం అలవాటు చేసుకుంటే సూక్ష్మ పోషకాల లోపం రాకుండా ఉంటుంది.

First Published:  18 Aug 2024 11:15 AM IST
Next Story