వయసు పెరిగేకొద్దీ ఆడవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
నలభై ఏళ్ల వయసు వచ్చేసరికి ఆడవాళ్లలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది.
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో రకరకాల మార్పులు జరుగుతుంటాయి. అందులోనూ మహిళల్లో వయసు 40 దాటుతున్నకొద్దీ హార్మోనల్ మార్పులు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు డైట్, లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే.
నలభై ఏళ్ల వయసు వచ్చేసరికి ఆడవాళ్లలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది. దాంతో కొంత నీరసం ఆవహిస్తుంది. నిద్రలేమి, ఒత్తిడి వంటివి కూడా మొదలవ్వొచ్చు. కాబట్టి ఈ దశలో పోషకాలు ఎక్కువగా లభించే పదార్థాలు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్ వంటివి తీసుకోవడం మొదలుపెట్టాలి.
మలి వయసు వచ్చేసరికి ఆడవాళ్లలో పిట్యూటరీ గ్రంథి పనితీరు నెమ్మదిస్తుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయి కూడా తగ్గడంతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు రావొచ్చు. కాబట్టి మలి వయసులో జంక్ ఫుడ్‌ను తగ్గించి పండ్లు, తాజా ఆహారాలు ఎక్కువగా తీసుకుంటుండాలి.
వయసు 50 దాటిన తర్వాత మహిళల్లో క్యాల్షియం లెవల్స్ పడిపోతాయి. దానివల్ల ఎముకలు బలహీనపడడం, కీళ్ల నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ వయసులో పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటుండాలి.
ఆడవాళ్లలో వయసు పైబడుతున్నకొద్దీ కండరాల సామర్థ్యం తగ్గుతుందని కొన్ని స్టడీల్లో తేలింది. దీనికోసం ప్రొటీన్స్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుండాలి.
ఇక వీటితోపాటు వయసు పైబడుతున్న కొద్దీ మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఐరన్ లోపిస్తుంటుంది. మెనోపాజ్ కారణంగా బరువు పెరిగిపోతుంటారు. వీటిని కంట్రోల్‌లో ఉంచుకోకపోతే క్రమంగా బీపీ, డయాబెటిస్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వయసు 40 దాటుతున్నప్పుడు మహిళలు డైట్‌లో మార్పులు చేసుకోవడం అవసరం. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, ఐరన్ అందేలా పండ్లు, ఆకుకూరలు, నట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
సరైన డైట్ పాటించడంతోపాటు రోజువారీ వ్యాయామాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను కలిసి తగిన సలహాలు తీసుకోవాలి.