Telugu Global
Health & Life Style

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఉన్న వ్యాధి ఏంటి? సీప్యాప్ యంత్రం వాడితే నిద్ర పడుతుందా?

2008 నుంచి బైడెన్ స్లీప్ ఆప్నియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. నిద్రలో ఉన్న సమయంలో గాలి పీల్చుకోవడం తరచూ ఆగిపోయి.. మళ్లీ మొదలవుతుంది. దీని వల్ల రాత్రంతా పడుకున్నా.. తెల్లారేసరికి అలసిపోయినట్లు ఉంటారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఉన్న వ్యాధి ఏంటి? సీప్యాప్ యంత్రం వాడితే నిద్ర పడుతుందా?
X

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. నిద్రకు సంబంధించిన ఈ తీవ్రమైన సమస్య కారణంగా.. బైడెన్ ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మెడికల్ పరిభాషలో స్లీప్ ఆప్నియాగా పిలిచే ఈ వ్యాధి ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే ఇటీవల జో బైడెన్ సీప్యాప్ (కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్) అనే యంత్రం సహాయంతో నిద్రపోతున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఇటీవల వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన బైడెన్ ముఖంపై గీతలు కనపడ్డాయి. దీనిపై పలువురు ఆరాతీయడంతో.. వైట్ హౌస్ వివరణ ఇచ్చింది.

2008 నుంచి బైడెన్ స్లీప్ ఆప్నియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. నిద్రలో ఉన్న సమయంలో గాలి పీల్చుకోవడం తరచూ ఆగిపోయి.. మళ్లీ మొదలవుతుంది. దీని వల్ల రాత్రంతా పడుకున్నా.. తెల్లారేసరికి అలసిపోయినట్లు ఉంటారు. దీంతో పాటు గురక సమస్య కూడా తలెత్తుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి స్లీప్ ఆప్నియా కారణంగానే మృతి చెందినట్లు వైద్యులు కూడా చెప్పారు. ఈ నిద్ర రుగ్మత కారణంగా పగటిపూట కూడా అలసిపోయినట్లు కనిపించడం, పని చేసే సామర్థ్యం తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అనేక శారీరిక సమస్యలకు కూడా ఇది దారి తీస్తుంది.

కాగా, స్లీప్ ఆప్నియాకు.. సాధారణ నిద్ర లేమి సమస్యకు మధ్య తేడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా నిద్రపోవడంలో ఉండే ఇబ్బందిని నిద్రలేమిగా చెబుతారు. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ, అంతర్లీన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కొంత మందిలో నిద్రలేమి తక్కువ కాలమే ఉంటుంది. మరి కొంత మందిలో రెండు లేదా ముడు నెలల పాటు కొనసాగుతుంది. రాత్రి పూట తరచుగా మేల్కొనడం, ఉదయాన్నే మేల్కొనడం.. పగటి పూట అలసట, చికాకు, ఏకాగ్రత మళ్లడం దీని ప్రధాన లక్షణాలు.

నిద్రలేమి వల్ల జీవన నాణ్యత తగ్గిపోతుంది. అయితే క్రమం తప్పకుండా ఒకే సమయంలో పడుకోవడం.. మద్యం, పొగతాగడానికి దూరంగా ఉండటం వల్ల నిద్రలేమిని తగ్గించుకోవచ్చు. ఉదయం, సాయంత్రం కాసేపు వాకింగ్ చేయడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. దీర్ఘకాలం నిద్రలేమి స్లీప్ ఆప్నియాకు దారి తీస్తుంది.

స్లీప్ ఆప్నియా ప్రధానంగా గాలి పీల్చుకునే మార్గంలో పాక్షికంగా లేదా పూర్తిగా అవరోధం ఏర్పడటం వల్ల వస్తుంది. ఇది తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఆక్సిజన్ కొరతకు కూడా దారి తీస్తుంది. ఆప్నియాస్ అని పిలువబడే శ్వాసలో విరామాలు కొన్ని సెకెన్ల నుంచి నిమిషాల వరకు ఉంటాయి. రాత్రంతా ఇలా పలుమార్లు జరుగుతుంది. ఊబకాయం లేదా శరీర నిర్మాణంలో అసాధారణతల వల్ల స్లీప్ ఆప్నియా వస్తుంది.

స్లీప్ ఆప్నియా కారణంగా గట్టిగా, దీర్ఘంగా గురక ఉంటుంది. గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. పగటి పూట నిద్రపోవడం, ఉదయం తలనొప్పి, ఏకాగ్రతలో ఇబ్బందులు ఏర్పడతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, టైట్-2 డయాబెటిస్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది.

స్లీప్ ఆప్నియా కోసం సీప్యాప్ యంత్రాలను అమెరికాలో ఎక్కువగా వాడుతుంటారు. ఇది శ్వాస ఆగిపోయే స్థితిలో బలవంతంగా గాలిని శ్వాస నాళాల్లోకి పంపుతుంది. రాత్రి పూట గురక సమస్యను తగ్గించడమే కాకుండా.. ప్రాణాపాయం నుంచి సీప్యాప్ ఉపయోగపడుంది.

First Published:  29 Jun 2023 11:18 AM IST
Next Story