Telugu Global
Health & Life Style

ప్లాగింగ్ ఫిట్‌నెస్ గురించి తెలుసా?

‘ప్లాగింగ్’ అంటే చెత్తను ఏరుతూ చేసే జాగింగ్. ఫిట్​నెస్​తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో మొదలైందే ప్లాగింగ్ కాన్సెప్ట్.

ప్లాగింగ్ ఫిట్‌నెస్ గురించి తెలుసా?
X

ప్లాగింగ్ ఫిట్‌నెస్ గురించి తెలుసా?

ఫిట్‌గా ఉండడం కోసం రన్నింగ్, జాగింగ్ వంటివి చేయాలని తెలుసు. కానీ, ‘ప్లాగింగ్’ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది జాగింగ్ లాంటిదే. అయితే ఇది చేయడం వల్ల ఫిట్‌నెస్‌తో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అదెలాగంటే..

‘ప్లాగింగ్’ అంటే చెత్తను ఏరుతూ చేసే జాగింగ్. ఫిట్​నెస్​తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో మొదలైందే ప్లాగింగ్ కాన్సెప్ట్. స్వీడన్‌లో స్టార్ట్ అయిన ప్లాగింగ్ ట్రెండ్.. ఇప్పుడు ప్రపంచమంతా పాపులర్ అవుతోంది. చాలామంది యువత ప్లాగర్స్‌గా మారి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు.

స్వీడిష్ భాషలో ‘ప్లోకా’ అంటే చేతిలోకి తీసుకోవడం, ‘జగ్గా’ అంటే పరిగెత్తడం. ఈరెండు పదాలను కలిపితే ప్లాగింగ్ అయింది. ప్లాగింగ్ చేసేవాళ్లు తమ వెంట ఒక బ్యాగ్‌ను ఉంచుకుంటారు. జాగింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా చెత్త కనిపిస్తే వెంటనే చెత్తను బ్యాగ్‌లో వేసుకుని మళ్లీ జాగింగ్ కొనసాగిస్తారు. ఇలా రోడ్డు, పార్కు, అడవులు ఎక్కడైనా ప్లాగింగ్ చేయొచ్చు. విదేశాల్లో ప్లాగింగ్ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. మనదేశంలో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోది. మనదేశంలో ఇటీవలే ‘ప్లాగర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో కొంతమంది గ్రూప్‌గా ఏర్పడి దీనిపై ప్రచారం చేస్తున్నారు. చెత్తతో పాటు ప్లాస్టిక్‌ కవర్లు కూడా ఏరడాన్ని వీళ్లు పనిగా పెట్టుకున్నారు. దీనివల్ల జంతువులకు, పక్షులకు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు.

మానసిక ఆరోగ్యం

ప్లాగింగ్‌తో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంకుడా లభిస్తుంది. ఫిట్‌నెస్ పరంగా జాగింగ్, వాకింగ్ కన్నా ప్లాగింగ్‌తోనే ఎక్కువ మేలు జరుగుతుంది. జాగింగ్‌తో పోలిస్తే ప్లాగింగ్‌ ద్వారా 15-–20 శాతం ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు. సాధారణంగా అరగంట సేపు జాగింగ్‌ చేస్తే సుమారు 235 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అదే ప్లాగింగ్‌లో అరగంటకు 280 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. కేవలం మార్నింగ్ వాక్‌లో మాత్రమే కాదు. ట్రెక్కింగ్, పర్వతారోహణ ఇలా ఎందులోనైనా ప్లాగింగ్‌ను అప్లై చేయొచ్చు.

పూర్తి వ్యాయామం

ప్లాగింగ్ ఒక మంచి వ్యాయామం కూడా. సాధారణంగా జాగింగ్‌లో ఒకే డైరెక్షన్‌లో పరిగెత్తాల్సి ఉంటుంది. కానీ ప్లాగింగ్‌లో అలా కాదు. ప్లాగింగ్ చేసేటప్పడు నడవడం, పరిగెత్తడం, కూర్చుని లేవడం, వంగడం ఇలా ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ భాషలో చెప్పాలంటే.. ప్లాగింగ్‌లో జాగింగ్‌తో పాటు, స్క్వాట్స్ కూడా చేసినట్టవుతుంది. అరగంట సేపు ప్లాగింగ్ చేయడం వల్ల జాగింగ్, స్క్వాట్స్, స్ట్రెచింగ్ వ్యాయామాలు, బ్యాలెన్సింగ్ వర్కవుట్స్ ఇవన్నీ చేసిన ఫలితం ఉంటుంది.

ఇలా చేయొచ్చు

ప్లాగింగ్ చేయడం చాలా సింపుల్. ఎవరి వీధుల్లో వాళ్లు మార్నింగ్ వాక్ లాగా ప్లాగింగ్ చేయొచ్చు. సింగిల్‌గా లేదా గ్రూపులుగా దీన్ని చేయొచ్చు. ప్లాగింగ్ చేయాలనుకునే వాళ్లు జాగింగ్‌కు వెళ్లేటప్పుడు ఒక సంచిని వెంట తీసుకెళ్లాలి. జాగింగ్ చేస్తూ బ‌యట క‌నిపించే ప్లాస్టిక్ బాటిళ్లు, కూల్‌డ్రింక్ బాటిళ్లు, ప్లాస్టిక్ క‌వ‌ర్లను సంచిలో వేసుకుంటూ రన్నింగ్ కొనసాగించాలి. ప్లాగింగ్ చేస్తూ సెల్ఫీ దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఫ్రెండ్స్‌ను కూడా ప్లాగింగ్‌ చేయమని కోరచ్చు.

First Published:  19 Oct 2023 5:30 PM IST
Next Story