Telugu Global
Health & Life Style

మీ శరీరంలో మెటబాలిజం బాగుందా ?

మెటబాలిజం అనేమాటని మనం తరచుగా వింటూ ఉంటాం కదా... శరీరంలో జీవక్రియలు జరిగి ఆహారం శక్తిగా మారడాన్ని మెటబాలిజం అంటారు.

Metabolism: మీ శరీరంలో మెటబాలిజం బాగుందా ?
X

Metabolism: మీ శరీరంలో మెటబాలిజం బాగుందా ?

మెటబాలిజం అనేమాటని మనం తరచుగా వింటూ ఉంటాం కదా... శరీరంలో జీవక్రియలు జరిగి ఆహారం శక్తిగా మారడాన్ని మెటబాలిజం అంటారు. మెటబాలిజం ప్రక్రియలో భాగంగా మన శరీరంలోని కణాల్లో పలురకాల రసాయనిక ప్రతి చర్యలు జరుగుతుంటాయి.


ఈ చర్యల వల్లనే మన శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చుకుని ఖర్చు చేస్తుంది. అంటే మెటబాలిజం బాగుంటేనే ఆహారం సవ్యంగా జీర్ణమవుతుంది అలాగే శరీరం దానిని తీసుకుని శక్తిమంతంగా ఉంటుంది. మనం విశ్రాంతి తీసుకుంటున్నపుడు కూడా శ్వాస తీసుకోవటం, ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం లాంటి పనులు జరగాలంటే మనకు శక్తి కావాలి. శరీర కదలికలకు ఆలోచనలకు అన్నింటికీ మనకు శక్తి అవసరమవుతుంది. అందుకే మన ఆరోగ్యం మన మెటబాలిజంపైన ఆధారపడి ఉంటుంది.

మెటబాలిజం తక్కువగా ఉంటే మన శరీరం తక్కువ కేలరీలను ఖర్చుచేస్తుంది. దాంతో ఖర్చుకానీ కేలరీలు శరీరంలో కొవ్వుగా నిలవ ఉంటాయి. అందుకే కొంతమంది తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకున్నా బరువు తగ్గలేరు.

మెటబాలిజం వేగంగా ఉంటే ఎక్కువ కేలరీలు ఖర్చయిపోతుంటాయి. అందుకే కొంతమంది ఎక్కువ ఆహారం తీసుకున్నా బరువు పెరగరు. అయితే మెటబాలిజం బాగున్నవారంతా సన్నగానే ఉంటారనడానికి కూడా లేదు. కొంతమంది లావుగా ఉన్నా...వారిలో మెటబాలిజం వేగంగానే ఉంటుంది. బరువు ఎక్కువ ఉన్నవారికి వారి శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అందుకే వారిలో ఎక్కువ కేలరీలు ఖర్చయిపోతూ మెటబాలిజం ఎక్కువే ఉంటుంది.

మెటబాలిజం నిదానంగా ఉంటే...

ఎప్పుడూ అలసటగా కనబడతారు. ఉదయం పక్కమీద నుండి లేవాలనిపించక పోవటం లేదా మధ్యాహ్నం పూట బాగా నిద్ర రావటం, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి.

♦ వీరు త్వరగా బరువు తగ్గలేరు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గకపోతే ఒకసారి మెటబాలిజం పరీక్షలు చేయించుకోవటం మంచిది.

♦ ఎప్పుడూ తీయని పదార్థాలు లేదా కొవ్వుతో కూడిన పదార్థాలు తినాలనిపిస్తుంటే మెటబాలిజం సవ్యంగా లేదని, శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చలేకపోతున్నదని అర్థం చేసుకోవాలి. దీనివలన అధిక బరువుతో పాటు ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

♦ కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం కూడా మెటబాలిజం తక్కువగా ఉన్నదనడానికి సంకేతంగా తీసుకోవాలి. శరీరం ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియను సరిగ్గా చేయలేకపోతున్నపుడు ఈ లక్షణాలుంటాయి.

♦ మెటబాలిజం సరిగ్గా లేనప్పుడు చర్మం పొడిబారి కనబడుతుంది. మెటబాలిక్ ప్రక్రియని నియంత్రించే హార్మోన్లే శరీరాన్ని తేమగా ఉంచుతాయి. అందుకే మెటబాలిజం తక్కువగా ఉంటే చర్మం కాంతిహీనంగా మారుతుంది.

మెటబాలిజం సవ్యంగా లేకపోతే ...

ఆహారం ద్వారా మనం పొందిన కేలరీలను శక్తిగా మార్చే మెటబాలిజంని రకరకాల అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. మెటబాలిజం వేగంగా లేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆహారపు అలవాట్లు, శారీరక చురుకుదనం, హార్మోన్ల అసమతౌల్యం, జన్యుపరమైన అంశాలు మెటబాలిజంని ప్రభావితం చేస్తాయి.

అధిక బరువు, ఊబకాయం ఉన్నవారిలో మెటబాలిక్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అధిక రక్తపోటు, రక్తంలో చెక్కర స్థాయి పెరగటం, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవటం, చెడు కొవ్వుల స్థాయి పెరగటం, మంచి కొవ్వులు తగ్గటం... ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్ ని కలిగించే పరిస్థితులు. అంటే మెటబాలిజం సవ్యంగా లేకపోతే ఏర్పడే పరిస్థితులు. మెటబాలిక్ సిండ్రోమ్ వలన శరీరంలో గుండెవ్యాధులు, మధుమేహం, స్ట్రోక్ లాంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

మరి మెటబాలిజం వేగాన్ని ఎలా పెంచుకోవాలి?

♦ బరువులు ఎత్తే వ్యాయామాల ద్వారా కండరాలను పెంచుకోవాలి. కండరాల్లోని కణజాలం మన శరీరం విశ్రాంతిగా ఉన్నపుడు కూడా కేలరీలను ఎక్కువగా ఖర్చు చేస్తుంది. అంటే మెటబాలిజం పెరుగుతుంది. అదే కొవ్వు ఎక్కువ ఉన్నవారిలో విశ్రాంతి దశలో ఎక్కువ కేలరీలు ఖర్చు కావు. కొవ్వు నిర్వహణకంటే కండరాల నిర్వహణకు ఎక్కువ కేలరీలు కావాలన్నమాట.

♦ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వ్యాయామాల ద్వారా కూడా మెటబాలిజం పెరుగుతుంది. అంటే... శరీరాన్ని బాగా శ్రమపెట్టే వ్యాయామం కాసేపు చేసి వెంటనే కాసేపు తక్కువ శ్రమతో కూడిన వ్యాయామం చేయాలి లేదా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఉదాహరణకు చాలా వేగంగా మెట్లు ఎక్కి తరువాత నిదానంగా నడవటం.

♦ ఉదయం పూట చేసే వ్యాయామమే కాదు రోజంగా శరీరం చురుగ్గా ఉండటం కూడా చాలా ముఖ్యం. లిఫ్ట్ కి బదులు మెట్లు ఎక్కడం, కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారు పని మధ్యలో విరామం తీసుకుని కాసేపు నడవటం లాంటి చేయాలి. రోజంతా చురుగ్గా ఉంటే మన మెటబాలిజంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.

♦ మెటబాలిజం బాగుండాలంటే తగినంత నీరు తాగుతుండాలి. ఐదువందల మిల్లీ లీటర్ల నీరు తీసుకుంటే ఒకగంటపాటు మన మెటబాలిజం 30శాతం వరకు పెరుగుతుంది. తగినంత నీరు తాగుతూ ఉండటం ద్వారా శరీరంలో నీరు లేకపోవటం కారణంగా మెటబాలిజం తగ్గటాన్ని నివారించవచ్చు.

♦ తగినంత నిద్ర ఉండాలి. నిద్ర తక్కువైతే మెటబాలిజం వ్యవస్థ పనితీరు దెబ్బతిని బరువు పెరుగుతారు. రోజుకి ఏడునుండి ఎనిమిది గంటలపాటు మంచి నిద్ర ఉన్నపుడు మెటబాలిజం ఆరోగ్యకరంగా ఉంటుంది.

♦ ఆహారంలో ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్లు జీర్ణం కావాలంటే మన శరీరానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. దాంతో ప్రొటీన్లు తీసుకున్నపుడు మన శరీరంలో తాత్కాలికంగా మెటబాలిక్ రేటు పెరుగుతుంది. కొవ్వు తక్కువగా ఉన్న పలుచని మాంసాహారాలు, చేపలు, పప్పు ధాన్యాలు, పాలతో తయారైన పదార్థాలు మొదలైనవి మనకు ప్రొటీన్లను ఇస్తాయి.

సమతుల ఆహారం, ప్రతిరోజూ వ్యాయామం, మంచినిద్ర, తగినంత నీరు తాగటం వలన మన శరీరంలో మెటబాలిజం సవ్యంగా జరుగుతుంది.

First Published:  16 July 2023 9:26 AM GMT
Next Story