Telugu Global
Health & Life Style

ఈ గింజలు రోజుకి గుప్పెడు తింటే చాలు!

మనం తీసుకునే ఆహార పదార్థాల్లో గింజలు అత్యంత ముఖ్యమైనవి. గింజల్లో అన్నిరకాల పోషకాలతో పాటు ప్రొటీన్స్, పీచు పదార్థాలు కూడా ఉంటాయి.

ఈ గింజలు రోజుకి గుప్పెడు తింటే చాలు!
X

మనం తీసుకునే ఆహార పదార్థాల్లో గింజలు అత్యంత ముఖ్యమైనవి. గింజల్లో అన్నిరకాల పోషకాలతో పాటు ప్రొటీన్స్, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. అందుకే ప్రతిఒక్కరూ రోజువారీ డైట్‌లో గింజలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలంటున్నారు డాక్టర్లు.

గింజల్లో మిల్లె్ట్స్, పప్పుధాన్యాలు, డ్రై నట్స్.. ఇలా పలు రకాలుంటాయి. అవసరాలకు తగ్గట్టు వీటిని రోజుకు కొంత తప్పక తీసుకుంటుండాలి. ముఖ్యంగా ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి గింజల నుంచే ఎక్కువగా అందుతాయి. రోజువారీ డైట్‌లో తప్పక తీసుకోవాల్సిన గింజలు ఏవంటే..

రోజువారీ డైట్‌లో అవిసె గింజలు తప్పక ఉండాలి. ఎందుకంటే వీటిలో ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి అవసరమైన కీలకమైన పోషకాలు. ఇవి చేపల్లో కూడా అధికంగానే ఉంటాయి. కానీ, చేపలను రోజూ తీసుకోలేము. కాబట్టి వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

రోజువారీ ఆహారంలో గుమ్మడి గింజలను కూడా తీసుకోవచ్చు. వీటిలో విటమిన్ ‘కె’, ‘ఇ’ లతో పాటు పాస్ఫరస్, జింక్, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ , కాపర్.. ఇలా అన్ని రకాల మినరల్స్ లభిస్తాయి. కాబట్టి రోజుకు కొన్ని చొప్పున వీటిని తీసుకోవడం ద్వారా మినరల్స్ లోపించే అవకాశమే ఉండదు.

‘బి’ కాంప్లెక్స్ విటమిన్స్ కోసం డైట్‌లో సన్ ఫ్లవర్ సీడ్స్‌ను తప్పక చేర్చుకోవాలి. ఇందులో విటమిన్ ‘ఇ’, ‘బి1’, ‘బి3’, ‘బి6’తో పాటు కాపర్, పాస్ఫరస్, ఫోలేట్ వంటివి ఉంటాయి. ఇవి కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలోని మలినాలను శుద్ధి చేస్తాయి.

డైట్‌లో ఒక స్పూన్ నువ్వులను చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావల్సిన రోజువారీ క్యాల్షియం లభించినట్టే. ఇందులో క్యాల్షియంతోపాటు మెగ్నీషియం, పాస్ఫరస్, ఐరన్, హెల్దీ ఫ్యాట్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయి.

ప్రతిరోజూ కొన్ని మెంతులను ఏదో రూపంలో తీసుకోవడం ద్వారా నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తుంది. మెంతుల్లో విటమిన్ ‘బి2(రైబోఫ్లావిన్)’, విటమిన్ ‘ఎ’, ‘బి6’, ‘సి’, ‘కె’లతో పాటు ఫోలిక్ యాసిడ్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి.

ఇక వీటితోపాటు రోజూ కొద్దిగా జీలకర్ర తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. అలాగే సబ్జా గింజలను తీసుకోవడం ద్వారా శరీరంలోని వేడిని తగ్గించుకోవచ్చు. అయితే గింజలను వేగించి తీసుకోవడం కంటే ఆరు గంటలు నానబెట్టి తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్.

First Published:  4 March 2024 7:15 PM IST
Next Story