వేసవిలో నడక మంచిదే కానీ..
నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
నడక ఓ తేలికపాటి వ్యాయామం. ఏ వయసు వారికైనా అనుకూలంగా ఉంటుంది. పెద్దగా ఖర్చు లేనిది, చవకైనది. సాధారణంగా నడక అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అలాగే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వేగంగా నడవడం వల్ల గుండెకు, శ్వాస వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది. ఆంగ్జయిటీ లేదా డిప్రెషన్‌తో బాధపడేవారికి నడక మరింత మంచిది.
అయితే వేసవిలో వేడి ఈ నడకను ప్రభావితం చేస్తుంది. వేడిగా ఉన్నప్పుడు సాధారణంగానే చెమట ఎక్కువ పడుతుంది. ఎండవేడికి త్వరగా అలసట, నీరసం వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన వ్యాయామాలు ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. అందుకే ఫిట్‌నెస్ స్థాయిలు సరిగ్గా ఉంచుకోవడం కోసం నడక సరైన వ్యాయామం. నడిచినపుడుశరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల అవుతాయి, ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది, క్రమం తప్పకుండా నడవడం వలన అధిక రక్త పోటు, అధిక కొలెస్ట్రాల్, స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్, డయాబెటీస్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు, తేమ వాతావరణం కారణంగా చాలా మందికి నడకకు వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికీ బయటకు వెళ్ళలేరు అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ నడకను కొనసాగించవచ్చు.
ఇలా ప్లాన్ చెయ్యండి ..
వేసవిలో ఎండ తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి సూర్యతాపం తక్కువ ఉన్నప్పుడు చల్లని ఉదయాన్నే నడవటం మంచిది. చెట్లకింద నుంచి భవనాల అంచుల నుంచి నడకను కొనసాగించాలి. నడకకు వెళ్లినపుడు తేలికైన వదులుగా ఉండే వస్త్రాలు ధరించాలి. దీనివల్ల చెమట త్వరగా ఆవిరైపోతుంది. చేతులకు, కాళ్లకు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం మరిచిపోవద్దు, లేదంటే మీ చర్మం సన్ ట్యాన్ కు గురై నల్లబడుతుంది. తీవ్రమైన ఉక్కపోత కారణంగా మీ శరీరం వేడెక్కే ప్రమాదం ఉంది. ఈ సమయంలో కొన్ని నీళ్లను మీ బట్టలపై చిలకరించుకోండి. నడుస్తున్నప్పుడు దాహం వేస్తే క్రమం తప్పకుండా కొన్ని సిప్స్ తీసుకోండి. ప్రతి 15 నిమిషాలకు ఆరు నుంచి ఎనిమిది ఔన్సుల నీరు తాగటం మంచిది.