క్యాలరీలు కరిగించేందుకు సింపుల్ టిప్స్!
ఇండియాలో మగవాళ్లు రోజుకి సగటున 500 క్యాలరీలు ఖర్చు చేస్తుంటే, మహిళలు రోజుకి కేవలం 400 క్యాలరీలు మాత్రమే ఖర్చు చేస్తున్నారట. ఇలా శారీరక శ్రమ తక్కువగా ఉండడం చేత ఒబెసిటీ సమస్యలు పెరుగుతున్నాయి.
రానురానూ మనదేశంలో ఒబెసిటీ సమస్య పెరుగుతోంది. ఇండియాలో మగవాళ్లు రోజుకి సగటున 500 క్యాలరీలు ఖర్చు చేస్తుంటే, మహిళలు రోజుకి కేవలం 400 క్యాలరీలు మాత్రమే ఖర్చు చేస్తున్నారట. ఇలా శారీరక శ్రమ తక్కువగా ఉండడం చేత ఒబెసిటీ సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే క్యాలరీలు కరిగించేందుకు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజులో కాస్త అటో ఇటో తిరుగుతుండకపోతే క్యాలరీలు ఖర్చు అవ్వవు. తింటున్న ఆహారానికి సరిపడా క్యాలరీలు ఖర్చు అవ్వకపోతే బరువు పెరిగి, పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే రోజులో కొంతైనా శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. దీన్ని రకరకాలుగా ప్లాన్ చేసుకోవచ్చు. అదెలాగంటే..
క్యాలరీలు ఖర్చు అవడానికి వ్యాయామం సరైన మార్గం. రన్నింగ్, సైక్లింగ్ వంటి ఎక్సర్‌సైజ్‌ల వల్ల క్యాలరీలు బాగానే ఖర్చవుతాయి. రోజూ ఒక గంట పాటు జాగింగ్ చేస్తే 400 క్యాలరీలు ఖర్చవుతాయి. ఒక గంట పాటు హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే రోజుకు 500 నుంచి 1000 క్యాలరీల వరకు తగ్గించుకోవచ్చు.
అందరికీ వ్యాయామం చేయడం కుదరక పోవచ్చు. అలాంటి వాళ్లు కనీసం నడక అయినా అలవాటు చేసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఆఫీసు దగ్గర్లో ఉంటే రోజూ నడుచుకుంటూ వెళ్ళడమో, ఇంట్లో మెట్లు ఎక్కిదిగటమో లాంటివి చేసినా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల 50- నుంచి 60 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. అలాగే శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోవటంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
కొంత మంది ఆఫీస్‌లో పని చేసేప్పుడు కదలకుండా గంటల తరబడి కూర్చొనే ఉంటారు. వీళ్లు పని చేసేచోటే గంటకోసారి లేచి అలా బయటకు వెళ్తుండాలి. దీనివల్ల శరీరంలో క్యాలరీలు ఖర్చవటంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
వంట చేయడం, కూరగాయలు కట్ చేయడం లాంటి పనుల వల్ల 100 నుంచి 200 దాకా క్యాలరీలు ఖర్చు అవుతాయి. అలాగే గదిని సర్దడం, బట్టలు మడతపెట్టడం వంటి చిన్న చిన్న పనుల వల్ల కూడా 100 క్యాలరీల దాకా శక్తి ఖర్చు అవుతుంది.
ఐదు నిముషాలు బిగ్గరగా నవ్వడం వల్ల కూడా మన శరీరంలో దాదాపు 40 క్యాలరీలు ఖర్చు అవుతాయి. మీ ఇంట్లో పెంపుడు జంతువులుంటే వాటిని బయటకు తీసుకెళ్ళడం ద్వారా సులభంగా గంటకు 200 క్యాలరీలను కరిగించుకోవచ్చు
ఇకపోతే ఫిజికల్ యాక్టివిటీతోపాటు తగిన ఆహారనియమాలు కూడా పాటించాలి. తక్కువ పని చేసేవాళ్లు క్యాలరీలు మితంగా తీసుకోవాలి. ఆహారంలో జంక్ ఫుడ్ లేకుండా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఆకలిగా అనిపిస్తుంటే ఫ్రూట్స్, నట్స్ లాంటివి తీసుకోవాలి. ఇలా సరైన క్వాంటిటీలో క్యాలరీలు తీసుకుంటూ క్యాలరీలు కరిగిస్తూ ఉంటే ఫిట్‌గా ఉండొచ్చు.