Telugu Global
Health & Life Style

విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి!

శరీర ఆరోగ్యానికి విటమిన్–డి ఎంత ముఖ్యమైనదో.. మితి మీరితే అంతే ప్రమాదం కూడా. అసలు విటమిన్–డి ట్యాబ్లెట్లు ఎవరు తీసుకోవాలి? ఎంత మేరకు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!

విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి!
X

ఇటీవలే యూకేకు చెందిన ఓ వ్యక్తి శరీరంలో విటమిన్–డి లెవల్స్ అధికంగా ఉన్న కారణంగా మరణించాడు. శరీర ఆరోగ్యానికి విటమిన్–డి ఎంత ముఖ్యమైనదో.. మితి మీరితే అంతే ప్రమాదం కూడా. అసలు విటమిన్–డి ట్యాబ్లెట్లు ఎవరు తీసుకోవాలి? ఎంత మేరకు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!

యుకెకు చెందిన మిచెనర్ అనే వ్యక్తి గత తొమ్మిది నెలలుగా విటమిన్–డి ట్యాబ్లెట్లు వాడడం వల్ల అతడి శరీరంలో క్యాల్షియం లెవల్స్ మరీ ఎక్కువగా పెరిగి ‘హైపర్‌ కాల్సెమియా’ అనే జబ్బుకి దారి తీసింది. దాంతో అతను మరణించాల్సి వచ్చింది. అయితే ఈ సందర్భంగా విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకునేవాళ్లు తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా డాక్టర్లు సూచిస్తున్నారు.

విటమిన్–డి ఎందుకంటే..

శరీరంలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ వంటి మినరల్స్ శోషణకు విటమిన్–డి అవసరం. ఇది కొవ్వులో కరిగే విటమిన్. అయితే ఇది తగిన పాళ్లలో మాత్రమే ఉండాలి. విటమిన్–డి లెవల్స్ ఎక్కువగా పెరిగితే రక్తంలో క్యాల్షియం లెవల్స్ పెరుగుతాయి. దీన్నే ‘హైపర్‌ కాల్సెమియా’ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సమస్య. రక్తంలో క్యాల్షియం పెరగడం ద్వారా వికారం, వాంతులు, మలబద్ధకం, అతి మూత్రవిసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీలు లేదా హార్ట్ ఫెయిల్ అవ్వొచ్చు. అలా కొన్నిసార్లు మరణం కూడా సంభవించొచ్చు.

ఎంత విటమిన్–డి తీసుకోవాలి?

శరీరానికి రోజుకి 15 మైక్రోగ్రాముల విటమిన్–డి సరిపోతుంది. ఇది సహజంగా సూర్యకిరణాల నుంచి లభిస్తుంది. పాలు, పాల పదార్థాలు, చేపలు, గుడ్డు, పుట్టగొడుగులు, పండ్లు, ఆకుకూరల వంటివి తీసుకుంటూ రోజుకి ఇరవై నిముషాలు ఉదయం ఎండలో నిల్చోవడం ద్వారా శరీరానికి కావల్సిన విటమిన్–డి లభిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సప్లిమెంట్లు వాడాల్సి వచ్చినప్పుడు డాక్టర్లు సూచించిన మోతాదులో తగినన్ని రోజులు మాత్రమే వాడి ఆపేయాలి. అలా కాకుండా సొంత వైద్యానికి పోయి కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వచ్చినప్పుడల్లా సప్లిమెంట్లు తెచ్చుకుని వాడకూడదు. అది అత్యంత ప్రమాదానికి దారి తీయొచ్చు. కాబట్టి విటమిన్–డి విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం.

First Published:  27 March 2024 7:30 AM IST
Next Story