Telugu Global
Health & Life Style

కూరగాయలను అధికంగా ఉడికిస్తే పోషకాలు తగ్గిపోతాయా? ఎలా వండాలి?

చాలా మందిలో అనుమానాలు ఉన్నట్లు కూరగాయలను అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే పోషకాలు పోతాయన్నది నిజమే. కానీ అది పూర్తిగా వాస్తవం కాదు.

కూరగాయలను అధికంగా ఉడికిస్తే పోషకాలు తగ్గిపోతాయా? ఎలా వండాలి?
X

మన శరీరానికి కూరగాయలు, మాంసాహారం అన్నిటి నుంచి పోషకాలను గ్రహించే శక్తి ఉన్నది. మన జీర్ణ వ్యవస్థ కేవలం కూరగాయలు లేదా మాంసాహారం కోసం మాత్రమే అంటూ రూపుదిద్దుకోలేదు. అయితే చాలా మంది ఆరోగ్యం మెరుగుపడటానికి కూరగాయలు, ఆకు కూరలు అయితే మంచిగా ఉపయోగపడతాయని భావిస్తుంటారు. కూరగాయలు ఆరోగ్యానికి చాలా మేలే చేస్తాయి. శాఖాహారులకు కూరగాయల ద్వారానే శరీరానికి కావల్సిన పోషకాలు అందుతుంటాయి. అయితే, మాంసాహారాన్ని వండినట్లు అధిక ఉష్ణోగ్రత వద్ద కూరగాయలను ఉడికిస్తే ఏమవుతుందనే అనుమానం మాత్రం చాలా మందిలో ఉంది. అలా చేయడం వల్ల వాటిలోని పోషకాలు అందకుండా పోతాయని కూడా అనుకుంటారు.

చాలా మందిలో అనుమానాలు ఉన్నట్లు కూరగాయలను అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే పోషకాలు పోతాయన్నది నిజమే. కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. ఆ కూరగాయ, ఆకు కూరలను బట్టి ఎలాంటి ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలో ముందుగా తెలుసుకోవాలి. తాజా కూరగాయలలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా దొరుకుతాయి. అందుకే వైద్యులు తాజా కూరగాయలు తినాలని సూచిస్తుంటారు. రెగ్యులర్‌గా వీటిని తీసుకోవడం వల్ల హృద్రోగ సమస్యలు, సడన్ హార్ట్ స్ట్రోక్స్, క్యాన్సర్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.

మాంసాహారాన్ని ఎక్కువ ఉష్ణోగ్రతపై వండాలి. కానీ కూరగాయలను వండే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడాల్సిందే. కూరగాయల్లో ఉండే బి, సి విటమిన్లు చాలా సున్నితంగా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడకపెడితే ఇవి ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, కొవ్వులో కరిగిపోయే ఏ, ఈ, డి, ఈ, కే వంటి విటమన్లు అధికంగా ఉడికిస్తేనే ఆహారంలో చేరతాయి. కాబట్టి మనం వండే కూరగాయల్లో ఏయే విటమిన్లు అధికంగా ఉన్నాయో చూసుకొని ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవాలి. ఏదైనా కూరగాయ, ఆకుకూరలో బి, సి విటమిన్లు అధికంగా ఉంటే.. తక్కువ ఉష్ణోగ్రత వద్ద, మిగిలిన విటమిన్లు అధికంగా ఉంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తినాలి.

కాగా, కూరగాయలను అధికంగా ఉడికించడం అంతే.. మాంసాహారం లాగా ఎక్కువ సేపు పొయ్యిపై ఉంచొద్దని.. సాధ్యమైనంత వరకు 5 నిమిషాల్లోనే అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తే మంచిదని అంటున్నారు. కేవలం వండటం విషయంలోనే కాకుండా కోయడం, తురమడంలో కూడా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. కూరగాయలను తురిమితే 40 శాతం బి విటమిన్ కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే కూరగాయలను కోసిన తర్వాత నీటిలో అస్సలు కడగొద్దు, నానబెట్టొద్దని అంటున్నారు. ఇలా చేయడం వల్ల పోషకాలు నష్టపోతామని స్పష్టం చేస్తున్నారు. అందుకే ముక్కలుగా కోయకముందే కూరగాయలు, ఆకుకూరలను శుభ్రం చేసుకొని నేరుగా వండుకోవాలని సూచిస్తున్నారు.

ఇక తాజా కూరగాయలను పచ్చిగా తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది మంచి లక్షణమే. అయితే ఈ మధ్య అన్ని కూరగాయలు, ఆకు కూరలు పురుగు మందుల సహాయంతో పండిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు పచ్చివి తినవద్దని హెచ్చిరిస్తున్నారు. క్యారెట్, కీరా వంటి వాటిని తొక్క తీసి తినడం కొంత వరకు మంచిదని చెప్తున్నారు. ఇక ఆర్గానిక్ పంటలు, ఇంటి పంటల నుంచి వచ్చే వాటిని నేరుగా తినడంలో ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేస్తున్నారు.

First Published:  9 Oct 2022 6:36 PM IST
Next Story