యాంటీ బయాటిక్స్ వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి!
ఒంట్లో కాస్త బాగోపోయినా, జ్వరం వచ్చినా, నొప్పులు వేధిస్తున్నా.. వెంటనే యాంటీబయాటిక్ మాత్రలు వేసుకుంటుంటారు చాలామంది. అయితే ఇకపై అలా చేయొద్దని సూచిస్తోంది 'ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)'.
ఒంట్లో కాస్త బాగోపోయినా, జ్వరం వచ్చినా, నొప్పులు వేధిస్తున్నా.. వెంటనే యాంటీబయాటిక్ మాత్రలు వేసుకుంటుంటారు చాలామంది. అయితే ఇకపై అలా చేయొద్దని సూచిస్తోంది 'ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)'. అసలు యాంటీబయాటిక్స్ ఎందుకు వాడొద్దంటే..
చిన్నచిన్న సమస్యలకు, జ్వరానికి, నొప్పులకు యాంటీ బయాటిక్స్ వాడడం వల్ల బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోతుందని ఐసీఎంఆర్ చెప్తోంది. ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు క్లినికల్ డయాగ్నసిస్ చేసి అదేంటో తెలుసుకొని సరైన వైద్యం చేయించుకోవాలే తప్ప యాంటీబయాటిక్స్ అతిగా వాడకూడదని డాక్టర్లు చెప్తున్నారు. నిమోనియా, సెప్టిసేమియా లాంటి వ్యాధులకు ఐసీయూలో ఉపయోగించే శక్తిమంతమైన యాంటీబయాటిక్ అయిన కార్బాపెనెమ్ ఇకపై భారతదేశంలో చాలామందికి ఉపయోగపడదని గతేడాది ఐసీఎంఆర్ చేసిన సర్వేలో తేలింది. వాళ్లందరికీ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పెరగడమే దీనికి కారణం. పేషెంట్లకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో కొన్నిరకాల వ్యాధులకు చికిత్స చేయడం కష్టమవుతోంది. అందుకే యాంటీ బయాటిక్స్ వాడకాన్ని తగ్గించమని ప్రజలకు సూచిస్తోంది. యాంటీ బయాటిక్స్ అతిగా వాడేవాళ్లకు కీలక సమయాల్లో చికిత్స చేయడం కష్టమవుతుందని హెచ్చరిస్తోంది.
యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఎప్పుడైనా శరీరంలో బాక్టీరియా పెరిగినప్పుడు.. వాడే మందుల డోస్ బాక్టీరియా మీద పనిచేయదు. దీనివల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుందే తప్ప తగ్గదు.
యాంటిబయాటిక్స్ వాడటం వల్ల జ్వరం, జలుబు వంటి సాధారణ అంటువ్యాధులపై ఎలాంటి చికిత్స చేయలేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. శరీరం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పొందితే తీసుకుంటున్న చికిత్సలు ఏవీ పనిచేయవు.
అనారోగ్యానికి గురైన ప్రతిసారీ యాంటీబయాటిక్స్ వాడటం తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ, మున్ముందు ఊహించని దానికంటే ఎక్కువ హాని కలుగజేస్తుంది. కాబట్టి యాంటీబయాటిక్స్ వాడే అలవాటుని తగ్గించుకోవడం మంచిది.