Telugu Global
Health & Life Style

గుర్తు తెలియని వైరల్ ఫీవర్స్! జాగ్రత్తలు ఇలా..

వర్షాకాలంలోమలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్ గున్యా.. ఇలా రకరకాల వైరల్ ఫీవర్స్ రావడం సాధారణమే. అయితే ఇప్పుడు వస్తున్న జ్వరాలు గుర్తు తెలియని విధంగా ఉంటున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.

గుర్తు తెలియని వైరల్ ఫీవర్స్! జాగ్రత్తలు ఇలా..
X

సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు పరీక్షలు చేసి అది ఏ జ్వరమో నిర్థారించి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు. అయితే ఇప్పుడొస్తున్న జ్వరాలు పరీక్షలకు దొరకట్లేదు. అది ఏ రకమైన జ్వరమో నిర్థారించలేక డాక్టర్లు అయోమయంలో పడుతున్నారు. ప్రస్తుతం హాస్పిటల్స్‌లో ఇలాంటి సైలెంట్ ఫీవర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

వర్షాకాలంలోమలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్ గున్యా.. ఇలా రకరకాల వైరల్ ఫీవర్స్ రావడం సాధారణమే. అయితే ఇప్పుడు వస్తున్న జ్వరాలు గుర్తు తెలియని విధంగా ఉంటున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. వైరల్ ఫీవర్ లక్షణాలు కనిపిస్తున్నా.. అది ఏ వైరస్ అన్నది తెలియడం లేదని చెప్తున్నారు.

జాగ్రత్తలు ఇలా..

వైరల్ ఫీవర్స్ పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, నీరసం, ఆయాసం, దగ్గు, గొంతు నొప్పి, శరీరంపై దద్దుర్లు, కళ్ల మంటలు, జలుబు.. వంటి లక్షణాల్లో ఏవి కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే జాగ్రత్తపడాలి. లక్షణాలు కనిపించినప్పుడు పారాసిటమాల్ వేసుకుని ఊరుకోకుండా డాక్టర్‌‌ను కలవాలి. ఇప్పుడొస్తున్న జ్వరాలు వారం నుంచి పది రోజుల పాటు ఉంటున్నాయని, కొంతమందికి హై టెంపరేచర్ , కొంతమందికి ప్లేట్‌లెట్స్ పడిపోవడం.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కోరకమైన లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ పర్యవేక్షణలో ఉండడమే మంచిది.

నివారణ ఇలా..

వైరల్ ఫీవర్లు ఒకరినుంచి మరొకరికి వ్యాపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, హాస్పిటల్స్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం మంచిది. జ్వరం వచ్చినప్పుడు ఏసీల్లో ఉండకుండా గాలి ఆడే గదుల్లో ఉంటే మంచిది. అలాగే కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి, కూల్‌డ్రింక్స్ తాగకూడదు, తేలికపాటి ఆహారాలు తినాలి. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలి. జ్వరాల విషయలో భయపడాల్సిన పని లేదు. కాస్త ఎక్కువరోజులపాటు ఇబ్బంది పెట్టినా సరైన ట్రీట్మెంట్‌తో జ్వరం నయం అవుతుంది.

First Published:  24 Aug 2024 8:21 AM IST
Next Story