టైప్ 1.5 డయాబెటీస్.. ఇది యమ డేంజర్
మధుమేహం అంటే మనకి ఇప్పటి వరకు టైప్ 1, టైప్ 2 గురించే తెలుసు. కానీ ఇప్పుడు మధుమేహం టైప్ 1.5 డయాబెటిస్ పేరుతో కొత్త రూపంలో మన ముందుకు వచ్చింది.
ఆధునిక జీవన విధానంలో వింతైన సమస్యలు తెచ్చిపెడుతోంది అనటంలో సందేహం లేదు. ముఖ్యంగా మనిషిని శారీరకంగా, మానసికంగా పూర్తిగా దెబ్బతిసే వ్యాధులలో షుగర్ ఒకటి. మధుమేహం నియంత్రణే తప్ప శాశ్వత చికిత్స లేదు. మధుమేహం అంటేమనకి ఇప్పటి వరకు టైప్ 1, టైప్ 2 గురించే తెలుసు. కానీ ఇప్పుడు మధుమేహం టైప్ 1.5 డయాబెటిస్ పేరుతో కొత్త రూపంలో మన ముందుకు వచ్చింది. దీన్నే లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ అని అంటారు. ఇందులో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రెండింటీ లక్షణాలు ఉంటాయి.
మిగతా వాటితో పోల్చితే డయాబెటీస్ టైప్ 1.5 అనేది మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని డయాగ్నోసిస్ చేయడం చాలా కష్టమని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టుగానే ఇందులో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రెండింటీ లక్షణాలు ఉంటాయి.టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే పాంక్రియాస్‌లోని సొంత కణాలను శరీర రోగ నిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీంతో శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా కోల్పోవడం లేదా చాలా తక్కువ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సాధారణంగా ఇది చిన్న వయసులోనే మొదలవుతుంది. ఇక టైప్ 2 మధుమేహం సహజంగా వయస్సు పెరిగిన తరువాత మొదలవుతుంది. ఇది ఉన్న వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. వీరిలో ఇన్సులిన్ ఉత్పత్తి ఉంటుంది కానీ శరీరానికి సరిపోదు.
టైప్ 1.5 డయాబెటిస్ అంటే ఏమిటి?
ఇది టైప్ 1డయోబెటిస్ లాగే మొదలై నెమ్మదిగా పెరుగుతుంది. అందుకే ఈ వ్యాధి బయట పడటానికి చాలా సమయం పడుతుంది. వ్యాధి ఉందని తెలిసిన కొన్ని నెలలు లేదా సంవత్సరం దాకా కూడా ఇన్సులిన్ చికిత్స అవసరం పడకపోవచ్చు. కానీ ఖచ్చితంగా 5 ఏళ్లలోపు ఇన్సులిన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. టైప్ 1.5 డయోబెటిస్ 30 ఏళ్ల దాటిన వాళ్లలో సాధారణంగా కనిపిస్తుంది. ఇది రావడానికి ముఖ్య కారణం సరైన లైఫ్ స్టైల్ మెయిన్‌టైన్ చేయడక పోవడమే. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోకుండా ఒత్తిడిని అధికంగా తీసుకోవడమే. అలా అని టైప్ 1.5 డయాబెటిస్ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. అధిక దాహం, తరచూ మూత్రం రావడం, అలసట, దృష్టిలో స్పష్టత లోపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటివి కొన్ని సార్లు వ్యక్తులను బట్టి మారుతూ ఉండచ్చు. ఈ తరహా లక్షణాలు ఉంటే ఒకసారి డయాబెటిస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే టైప్ 1.5కు కారణం టైప్ 1 డయాబెటిస్‌లో ఉండేది కానీ లక్షణాలు మాత్రం టైప్ 2 లాంటివి.