Telugu Global
Health & Life Style

మతిమరుపు రాకుండా... మెదడు శక్తి పోకుండా ఉండాలంటే...

మనకు వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది.

మతిమరుపు రాకుండా... మెదడు శక్తి పోకుండా ఉండాలంటే...
X

మనకు వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. మెదడుకి సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే వయసు పెరుగుతున్నా మతిమరుపు, మెదడు వ్యాధులు రాకుండా ఉండాలంటే కొన్ని విషయాల పట్ల అవగాహన, మరికొన్ని జాగ్రత్తలు అవసరం. అవేంటో చూద్దాం

-మనకు రోజంతా జరిగిన విషయాలు బాగా గుర్తుండాలంటే నిద్ర చాలా అవసరం. రాత్రంతా మంచి నిద్ర ఉంటే... మన మెదడు...ఆ రోజు జరిగిన సంఘటనల తాలూకూ ఆలోచనలను ఫీలింగ్స్ ని నిద్రలో ఉన్నపుడు మరింత బలంగా మార్చి గుర్తుంచుకుంటుంది.

-సాధారణంగా మనకు వయసు పెరగటం వల్లనే మతిమరుపు వస్తుందని చాలామంది అనుకుంటారు కానీ డీహైడ్రేషన్, ఇన్ ఫెక్షన్లు, మాదకద్రవ్యాలు, పోషకాహార లేమి, డిప్రెషన్, యాంగ్జయిటీ, థైరాయిడ్ సమస్యలు వంటివి కూడా మతిమరుపకి కారణం కావచ్చు.

-పెద్దవయసు వారందరికీ ఎంతోకొంత మతిమరుపనేది ఉంటుందని మనం భావిస్తుంటాం కదా... కానీ అది నిజం కాదు... శారీరకంగా మానసికంగా చురుగ్గా ఉన్నవారిలో వయసు పెరుగుతున్నా మెదడు ఆరోగ్యంగానే ఉంటుంది. మతిమరుపు రాదు. శారీరకంగా చురుగ్గా లేనివారిలో మెదడుకి ఛాలెంజ్ గా అనిపించే పనులు చేయనివారిలో మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

-నలుగురితో కలిసిమెలసి ఉంటూ సామాజికంగా చురుగ్గా ఉండేవారికి, ఒంటరిగా కాకుండా ఆత్మీయులతో కలిసి జీవించేవారిలో మెదడు శక్తి సామర్ధ్యాలు బాగుంటాయి. అలాంటివారికి మతిమరుపు వచ్చే అవకాశం తక్కువ.

-రక్తపోటు కూడా మన మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అధిక రక్తపోటు ఉన్నపుడు రక్తనాళాలు మెదడుకి అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేవు. దీనివలన మతిమరుపు వచ్చే అవకాశం పెరుగుతుంది. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లాంటి ఏరోబిక్ వ్యాయామాలతో రక్తపోటు క్రమబద్ధమవుతుంది. దాంతో మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతుంది.

-పజిల్స్ పూర్తి చేయటం, వేగంగా నడవటం... లాంటివి చేయటం వలన అంటే శరీరం మెదడు రెండింటినీ చురుగ్గా ఉంచినప్పుడు మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పెద్దవయసువారు ఎనిమిది వారాలపాటు ధ్యానం చేయటం వలన వారిలో మతిమరుపు సమస్యలు తొలగటం పరిశోధకులు గుర్తించారు.

-వయసు మళ్లినవారిలో మతిమరుపు సమస్యకంటే ఏకాగ్రత లేకపోవటం ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత లేకపోవటం కారణంగా వచ్చే సమస్యలను మతిమరుపుగా వారు భావించే అవకాశం ఉంది. అందుకే పనులు చేసేటప్పుడు వాటిపైనే ధ్యాస ఏకాగ్రత పెట్టి చేయటం వలన మతిమరుపు ఉండదని మానసిక నిపుణులు చెబుతున్నారు.

-మతిమరుపుని అల్జీమర్స్ వ్యాధికి మొదటి సూచనగా భావించవచ్చు. మెదడుకి మతిమరుపు వ్యాధి అల్జీమర్స్ వచ్చే ముందు చాలామందిలో మెదడు సామర్ధ్యం తగ్గి మతిమరుపు వస్తుంది. అయితే మతిమరుపు ఉన్నవారందరికీ అల్జీమర్స్ వస్తుందని చెప్పలేము.

-తాళాలు ఎక్కడ పెట్టారో మర్చిపోవటం, లేదా తెలిసిన పేర్లు పదాలు గుర్తు రాకపోవటం, కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఎక్కువ సమయం పట్టటం... ఇవన్నీ కాస్త మతిమరుపుకి సూచనలే. అయితే వీటిని తీవ్రంగా భావించాల్సిన అవసరం లేదు. కానీ బాగా తెలిసిన, తిరిగిన ప్రాంతాల్లో దారులు మర్చిపోవటం మాత్రం తీవ్రమైన మతిమరుపుకి సంకేతాలుగానే భావించాలి. అలాంటివారికి అల్జీమర్స్, డిప్రెషన్, రక్తప్రసరణ సమస్యలు ఉండే అవకాశం ఉంది. అడిగిన ప్రశ్నలనే పదేపదే అడగటం, కాలం, మనుషులు, ప్రదేశాలను గుర్తుపెట్టుకోలేక గందరగోళానికి గురికావటం, తమ గురించి తాము శ్రద్ధ తీసుకోలేకపోవటం... కూడా తీవ్రమైన మతిమరుపుకి సంకేతాలు కావచ్చు.

-

First Published:  23 Aug 2023 10:54 AM IST
Next Story