Telugu Global
Health & Life Style

వర్షాకాలంలో పొంచిఉన్న డెంగ్యూ ముప్పు.. తప్పించుకుందాం ఇలా..

డెంగ్యూ సోకినపుడు విపరీతమైన జ్వరం ఉంటుంది. అంతే కాదు నిరంతరం తలనొప్పి, కళ్ళల్లో నొప్పి, కనురెప్పల చుట్టూ నొప్పి, ఒళ్ళు నొప్పులు, మంటతో కూడిన కీళ్ల నొప్పులు, అనారోగ్యానికి గురైన కొద్ది రోజులలో దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వర్షాకాలంలో పొంచిఉన్న డెంగ్యూ ముప్పు.. తప్పించుకుందాం ఇలా..
X

వర్షాకాలానికి ఇంకో పేరే వ్యాధుల కాలం. ఎందుకంటే వర్షాకాలం తనతో పాటు ఎన్నో రకాల వ్యాధులను వెంటబెట్టుకొని వస్తుంటుంది. దీంట్లో ప్రధానమైన వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఇది సాధారణంగా 8-10 రోజుల పాటు వేధించే వ్యాధి. ఏడిస్‌ జాతికి చెందిన దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే చాలా వరకు డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాన్ని పోలి ఉండడంతో మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో అది ప్రాణాపాయానికి కూడా దారి తీస్తుంది.

వ్యాధి లక్షణాలు

డెంగ్యూ సోకినపుడు విపరీతమైన జ్వరం ఉంటుంది. అంతే కాదు నిరంతరం తలనొప్పి, కళ్ళల్లో నొప్పి, కనురెప్పల చుట్టూ నొప్పి, ఒళ్ళు నొప్పులు, మంటతో కూడిన కీళ్ల నొప్పులు, అనారోగ్యానికి గురైన కొద్ది రోజులలో దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే విపరీతంగా వాంతులు, చిగుళ్లలో రక్తస్రావం, కడుపునొప్పి విపరీతమైన అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.


ఇలా జాగ్రత్తపడాలి..

సాధారణంగా దోమలన్నీ కూడా ఎక్కువగా చీకటి పడ్డ తర్వాత విజృంభిస్తాయి. కానీ డెంగ్యూ వ్యాధి కలిగించే ఏడిస్ దోమలు పగటిపూట కుడతాయి. ఇవి మురుగు నీటిలో పెరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఇవి ఎక్కువగా ఉదయం వేళల్లో 7 నుండి 9 గంటల సయమం వరకు, అలాగే సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య కుడతాయి. ఇక రాత్రి పూట నీటి ఉపరితలంపై గుడ్లను పెడుతుంటాయి. ఇక డెంగ్యూ వైరస్‌ సోకిన రోగిని కుట్టిన తర్వాత దోమ ఆ వైరస్‌ను తీసుకెళ్లి ఆరోగ్యంగా ఉన్న మరో వ్యక్తిని కుట్టినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కాబట్టి దోమల నుండి శరీరాన్ని కాపాడుకోవాలని, ఇంటి పరిసరాలలో దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు.

First Published:  8 July 2024 9:56 AM IST
Next Story