Telugu Global
Health & Life Style

టెన్షన్‌తో తలనొప్పి వస్తుందా? ఇలా తగ్గించొచ్చు!

టెన్షన్ పడుతున్నప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు మెదడుపై ఎక్కువగా భారం పడుతుంది. దీని కారణంగా మెదడులో హార్మోన్ల మార్పు జరిగి నరాలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతాయి. తద్వారా తలనొప్పి మొదలవుతుంది.

టెన్షన్‌తో తలనొప్పి వస్తుందా? ఇలా తగ్గించొచ్చు!
X

శరీరాన్ని ఎంత శ్రమ పెట్టినా పెద్దగా నష్టముండదు. కానీ, మెదడుపై ఒత్తిడి పడితే మాత్రం అది రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో స్ట్రెస్, డిప్రెషన్ వంటి పలు మానసిక సమస్యల వల్ల తలనొప్పి సమస్య ఎక్కువ అవుతుంది. ఈ రకమైన తలనొప్పి ఎందుకొస్తుంది? ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

టెన్షన్ పడుతున్నప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు మెదడుపై ఎక్కువగా భారం పడుతుంది. దీని కారణంగా మెదడులో హార్మోన్ల మార్పు జరిగి నరాలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతాయి. తద్వారా తలనొప్పి మొదలవుతుంది. దీన్నే స్ట్రెస్ హెడేక్, టెన్షన్ హెడేక్ అనొచ్చు. ఇదెలా తగ్గుతుందంటే..

స్ట్రెస్ లేదా టెన్షన్స్ వల్ల వచ్చే తలనొప్పి ఐదు నిమిషాల నుంచి నాలుగైదు రోజుల వరకూ ఉంటుంది. స్ట్రెస్ లెవల్స్‌ను బట్టి నొప్పి తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఈ రకమైన నొప్పి నుదుటి దగ్గర లేదా తల వెనుక భాగంలో ఎక్కువగా వస్తుంది. తల అంతా బరువుగా అనిపిస్తుంది. ఇది టెన్షన్ వల్లనే కాక కొన్నిసార్లు అలసట వల్ల కూడా రావొచ్చు.

స్ట్రెస్ హెడేక్ వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. నొప్పి గురించో లేక సమస్యల గురించో ఎక్కువగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయాలి. మొబైల్ లేదా ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించాలి. తలనొప్పి ఉన్న రోజుల్లో వ్యాయామాలు చేయకపోవడమే మంచిది. అలాగే గట్టిగా నమిలి తినాల్సి వచ్చే ఆహారాలకు బదులు తేలికపాటి ఫుడ్స్, లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.

టెన్షన్ హెడేక్ లేదా స్ట్రెస్ హెడేక్ ఉన్నప్పుడు ఇంట్లో డిమ్ లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. పెద్ద శబ్దాలకు దూరంగా ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్‌ వేసుకోకూడదు. నొప్పి రెండు మూడు రోజులైనా తగ్గకపోతుంటే అప్పుడు తప్పక డాక్టర్‌‌ను సంప్రదించాలి.

First Published:  12 July 2024 2:30 AM GMT
Next Story