భయపెడుతన్న హీట్ వేవ్! వడదెబ్బతో జాగ్రత్త!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో టెంపరేచర్ 45 డిగ్రీలు దాటుతోంది. ఇలాంటప్పుడే చాలా అప్రమత్తంగా ఉండాలి
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో టెంపరేచర్ 45 డిగ్రీలు దాటుతోంది. ఇలాంటప్పుడే చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బయట తిరిగేవాళ్లు శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మండే ఎండల్లో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. బయట పనిచేసే వాళ్లతోపాటు ఇంటిపట్టున ఉండేవాళ్లు కూడా తగిన కేర్ తీసుకుంటుండాలి. రూం టెంపరేచర్ పెరగడం ద్వారా ఇంట్లో ఉండేవాళ్లకు కూడా సన్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..
వడదెబ్బ ఒకేసారి తగిలినప్పుడు కళ్లు తిరిగి పడిపోతారు. అలాంటప్పుడు వెంటనే వారిని నీడలోకి తీసుకెళ్లి నీళ్లు ఇవ్వాలి. ఆ తర్వాత దగ్గర్లోని హాస్పిటల్ కు చేర్చాలి.
ఉన్నట్టుండి బాడీ టెంపరేచర్ పెరిగితే అది ఎండదెబ్బ లక్షణంగా గుర్తించాలి. అలాగే శ్వాస పెరగడం, ఊపిరి కష్టంగా అనిపించడం కూడా వడ దెబ్బ లక్షణాలే. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ ను కలవాలి.
వడదెబ్బ తగిలేముందు అయోమయం, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ద్రవాలు పూర్తిగా అయిపోయినప్పుడు నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతినడం వల్ల ఇలా జరగొచ్చు. ఇలాంటప్పుడు నిమ్మరసం వంటివి తాగి, కూలర్ కింద పడుకోవాలి. తల తిరగడం తగ్గిన తర్వాత హాస్పిటల్ కు వెళ్లాలి.
వడదెబ్బకు ముందు కొంతమందిలో వాంతులు అవ్వడం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం పొడిబారి చెమట పట్టడం ఆగిపోయినా కూడా అది వడదెబ్బ లక్షణంగానే అనుమానించాలి. ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే తప్పక డాక్టర్‌ను కలవాలి.
జాగ్రత్తలు ఇలా..
వడదెబ్బ తగలకూడదంటే రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండాలి. గంటకోసారి నీళ్లు తాగుతుండాలి. చెమటలు ఎక్కువగా పడుతుంటే తప్పకుండా నిమ్మరసం, కొబ్బరినీళ్లు, ఓఆర్‌ఎస్ డ్రింక్ వంటివి తాగాలి.
ఎండ ఎక్కువగా ఉండే రోజుల్లో బయట పనులు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఇంటి పట్టునే ఉండడం మంచిది.
సమ్మర్‌లో అత్యంత త్వరగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. అలాగే నూనె పదార్థాలు, మాంసం కూడా మితంగా తీసుకుంటే మంచిది.