వేసవిలో కంటిచూపును కాపాడుకోండిలా..
వేసవిలో మన ఆరోగ్యం, చర్మం మాదిరిగానే, కళ్లు కూడా చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. అందుకే కొన్ని రకాల చిట్కాలు పాటించి..ఎండాకాలంలో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవిలో మన ఆరోగ్యం, చర్మం మాదిరిగానే, కళ్లు కూడా చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. అందుకే కొన్ని రకాల చిట్కాలు పాటించి..ఎండాకాలంలో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో కంటి మంట, ఎరుపు, నొప్పి సాధారణ సమస్యలు. అంటే కాక వేడి కారణంగా కళ్లు పొడిబారుతాయి. ఇతర రోజుల కంటే వేసవిలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ. దీనివల్ల కళ్ల సంరక్షణతోపాటు వాటి పరిశుభ్రతపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే డ్రై అయ్యి కంటి చూపు తగ్గే ప్రమాదం ఉంది. బయటికి వెళ్లేటప్పుడు సన్‌గ్లాసెస్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అందులోనూ ఇటీవల కంటిశుక్లం, గ్లాకోమా శస్త్రచికిత్స చేయించుకుంటున్న వారికైతే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.
వేసవిలో బయటకు వెళ్లే వారు ఖచ్చితంగా సన్ గ్లాసెస్ ధరించాలి. మంచిక్వాలిటీ సన్ గ్లాసెస్ సూర్యకిరణాల నుంచి కాపాడుతాయి. అయితే ఇది సమస్యలకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. అలాగే కళ్ళను తాకడానికి ముందు చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. కళ్ళను రోజుకు రెండు మూడు సార్లు కడగాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి అధికంగా నీటిని తాగుతూ ఉండాలి.
ఐస్ ప్యాక్ ..
వేసవిలో ఎర్రగా మారిన కళ్ళ మీద ఐస్ ప్యాక్‌లు పెడితే కళ్ల మంట, ఎరుపు కాస్త తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఐస్ ప్యాక్ బదులు ఒక కాటన్ రుమాలులో ఐస్ క్యూబ్‌ను చుట్టి, 5 నుంచి 10 నిమిషాల పాటు కళ్లపై ఉంచండి. ఇలా చేయడం వల్ల కళ్లు చల్లబడి కొంతమేర ఎర్రబడడం తగ్గుతుంది.
కీరదోస, బంగాళా దుంప..
కళ్లలోని ఎరుపును తొలగించాలంటే కీరదోసకాయ ముక్కలను కళ్లపై అరగంట పాటు ఉంచండి. రోజుకు రెండుసార్లు చేస్తే దోసకాయలోని శీతలీకరణ గుణాలు కళ్లను చల్లబరుస్తాయి. రక్తనాళాల్లో వాపులను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే బంగాళ దుంప ముక్కలు కూడా బాగా పని చేస్తాయి. కంటి అలసట, చికాకు నుంచి ఉపశమనం పొందడానికి కళ్లలో రోజ్ వాటర్ వేసుకోవచ్చు. ఇది కళ్ళను శుభ్రపరుస్తుంది. అలాగే కళ్లు ఎర్రబడితే టీ బ్యాగ్‌ను నీటిలో ముంచి, రిఫ్రిజిరేటర్‌లో సుమారు 2 గంటలు ఉంచండి. ఆ తర్వాత, టీ బ్యాగ్‌లను కళ్లపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ ఇవి ఉపశమనం కలిగించకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.