Telugu Global
Health & Life Style

ఉల్లితో షుగర్ కి చెక్

ఉల్లిపాయల్లో రక్తంలో చెక్కర పెరుగుదలని నియంత్రించే అంశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెడిసినల్ ఫుడ్ అనే జర్నల్ లో ఈ విషయాలు ప్రచురించారు.

Sugar Control Tips in Telugu
X

ఉల్లితో షుగర్ కి చెక్

రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. 2030 నాటికి ఇది అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో ఏడవదిగా మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం వస్తే మొత్తం ఆరోగ్యం దాని చేతుల్లోకి వెళ్లిపోయినట్టే. షుగర్ ని అదుపులో పెట్టుకోకపోతే గుండెసమస్యలు, మూత్రపిండాల వైఫల్యం లాంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు పీచు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవటం చాలా అవసరం. వీరికి ఏ ఆహారాలు రక్తంలో చెక్కరని వేగంగా పెంచుతాయి... అనే విషయంలో అవగాహన ఉండాలి. ఈ క్రమంలో ఉల్లిపాయలు మధుమేహులకు మేలు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్లు రక్తంలో చెక్కరని తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొరియా శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో ఉల్లిపాయలు జంతువుల్లో టైప్ టు డయాబెటిస్ ని తగ్గించినట్టుగా తేలింది. ఉల్లిపాయల్లో రక్తంలో చెక్కర పెరుగుదలని నియంత్రించే అంశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెడిసినల్ ఫుడ్ అనే జర్నల్ లో ఈ విషయాలు ప్రచురించారు.

ఉల్లిపాయల్లోని ఈ ఔషధ గుణానికి కారణం...

ఉల్లిపాయల్లో... ముఖ్యంగా ఎరుపు రంగున్న వాటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. పీచు ఉన్న పదార్థాలను మనం తిన్నపుడు అవి త్వరగా జీర్ణం కావటం, అంతే త్వరగా రక్తంలో చెక్కరగా మారటం జరగవు. ఇవి నిదానంగా జీర్ణం కావటం వలన రక్తంలో చెక్కర స్థాయి వేగంగా పెరగదు. దాంతో వీటిని తినటం వలన మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుంది. అలాగే పీచు ఉన్న ఆహారాలను తినటం వలన మలబద్ధకం ఉండదు. మధుమేహుల్లో సాధారణంగా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

పిండి పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారాలు రక్తంలో చెక్కరని వేగంగా అధికంగా పెంచుతాయి. ఉల్లిపాయల్లో పిండిపదార్థాలు తక్కువ స్థాయిలో ఉండటం వలన అలాంటి సమస్య ఉండదు. మధుమేహం ఉన్నవారు పిండిపదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. వంద గ్రాముల ఉల్లిపాయల్లో ఎనిమిది గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి.

ఉల్లిపాయల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఒక పదార్థం తాలూకూ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా అవి రక్తంలోని చెక్కర స్థాయిని పెంచుతాయి. ఉల్లిపాయల గ్లైసెమిక్ ఇండెక్స్ 10 కావటంతో ఇవి రక్తంలోని చెక్కర స్థాయిపై ఎక్కువ ప్రభావం చూపవు. గ్లైసమిక్ ఇండెక్స్ ని సున్నా నుండి వంద వరకు ర్యాంకులతో లెక్కవేస్తారు.

మధుమేహం ఉన్నవారు ఉల్లిపాయలను నేరుగా పచ్చివే ఆహారంలో చేర్చుకుని తినవచ్చు. అయితే ఏ ఆహారమైనా ఎంత మంచిదైనా మరీ ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు. అతి ఏదైనా చెడు చేస్తుంది కనుక..తగినంత మోతాదులో ఉల్లిని ఆహారంలో భాగం చేసుకుని తినటం మేలు.

First Published:  17 Sept 2022 10:45 PM IST
Next Story