Telugu Global
Health & Life Style

సొంత వైద్యం... ఆ రెండింటితో పని కానిస్తున్న జనం

గతంలో ఒంట్లో కాస్త నలతగా ఉన్నా దగ్గర్లోని ఆర్ఎంపీ దగ్గరకో, చిన్న క్లినిక్‌కో వెళ్లి చికిత్స చేయించుకునే వాళ్లు.

సొంత వైద్యం... ఆ రెండింటితో పని కానిస్తున్న జనం
X

గతంలో ఒంట్లో కాస్త నలతగా ఉన్నా దగ్గర్లోని ఆర్ఎంపీ దగ్గరకో, చిన్న క్లినిక్‌కో వెళ్లి చికిత్స చేయించుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ఏదైనా పెద్ద రోగం వస్తే తప్ప.. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి ఆసుపత్రులకు పోవడమే లేదు. అసలు సీజనల్ వ్యాధులు వ్యాపించే ఈ సమయంలో ఎలాంటి చిన్న రోగానికైనా డాక్టర్లను సంప్రదించడం మందిచి. డెంగ్యూ, మలేరియా వంటి జబ్బులు ఈ కాలంలో ఉధృతం అవుతాయని వైద్య నిపుణలు చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రం దగ్గర్లోని మెడికల్ షాపుకు వెళ్లి మందులు కొనుక్కొని సొంత వైద్యం చేసుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఆ వైరస్ చికిత్సలో భాగంగా డోలో 650 ట్యాబ్లెట్ల వాడకం భారీ పెరిగిపోయింది. పారాసిటమల్ ట్యాబ్లెట్లు చాలా రూపాల్లో ఉన్నా.. కచ్చితమైన మోతాదు కావడంతో డాక్టర్లు డోలో 650ని రిఫర్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గింది. వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. చాలా మంది జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల బారిన పడుతున్నారు. అన్ని రోగాలకు ఒకటే మందు.. జిందాతిలిస్మాత్ అన్నట్లు.. ఇప్పుడు డోలో 650ని ఆశ్రయిస్తున్నారు.

మే నెలతో పోలిస్తే అగస్టు తొలి రెండు వారాల్లో డోలో వాడకం తెలంగాణలో రెండింతలు పెరిగినట్లు నివేదికలు తెలిపాయి. కేవలం డోలోనే కాకుండా దగ్గు సిరప్‌లు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకపోయినా ఈ మందులు అమ్మడానికి అనుమలు ఉండటంతో.. ఫార్మసీలు కూడా ఎవరైనా జ్వరం, దగ్గు అని వస్తే డోలో 650తో పాటు ఒక దగ్గు మందు చేతిలో పెడుతున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వైద్య నిపుణులు చెప్తున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సంక్రమిస్తున్న సమయంలో జ్వరం ఉందని డోలో వేసుకుంటూ వెళ్తే.. ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

కాగా, ప్రజలు కూడా మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కొని వ్యాధిని తగ్గించుకునే ప్రయత్నం వెనుక ఆసుపత్రులకు వెళ్లడానికి భయపడటం ఒక కారణం. ఏ చిన్న ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినా కనీసం రూ. 300 ఓపీ చార్జి చేస్తారు. ఒక వేళ కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఓపీకి కనీసం రూ. 600 నుంచి రూ. 800 పెట్టాల్సిందే. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత టెస్టులు, స్కానింగ్స్ అంటూ రాస్తారు. ఆ తర్వాత వాళ్లు కూడా ఇచ్చేది డోలోనే అనే భావన పెరిగిపోయింది. ఆ ఖర్చులన్నీ పెట్టే బదులు రూ. 10తో సొంత వైద్యం చేసుకుంటున్నారు.

ఇప్పుడు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పుడు నాలుగైదు రోజుల పాటు ఉంటేనే అప్పుడు ఆసుపత్రులకు వెళ్తున్నారు. కానీ కొందరి విషయంలో అప్పటికే ఆలస్యం కావడంతో పరిస్థితి విషమిస్తోంది. చివరకు ఐసీయూల పాలు కావల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల ఒక నటుడు కూడా సొంత వైద్యం చేసుకొని ఇంట్లోనే ఉన్నాడు. చివరకు ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో అపోలో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. చిన్న జ్వరమైన ఈ కాలంలో నిర్లక్ష్యం చేయవద్దని.. సాధ్యమైనంత త్వరగా స్పెషలిస్టు డాక్టర్ల వద్దకు వెళ్లి పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కేవలం డోలో, దగ్గు సిరప్ వేసుకంటే మామూలు జ్వరం తగ్గుతుంది. కానీ మలేరియా, డెంగ్యూ వంటివి ప్రాణాల మీదకు తెస్తుందని హెచ్చరిస్తున్నారు.

First Published:  17 Aug 2022 11:36 AM IST
Next Story