భయపెడుతున్న లాంగ్ కోవిడ్ లక్షణాలు! జాగ్రత్తలు ఇలా..
అప్పట్లో కోవిడ్ అంటే భయం ఉండేది. ఇప్పుడు అంతా నార్మల్ అయింది కాబట్టి కోవిడ్ గురించిన భయం లేదు. కానీ, కోవిడ్ బారినపడిన కొంతమందికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బాధిస్తుండడం ఇప్పుడు అందర్నీ భయపెడుతుంది.
అప్పట్లో కోవిడ్ అంటే భయం ఉండేది. ఇప్పుడు అంతా నార్మల్ అయింది కాబట్టి కోవిడ్ గురించిన భయం లేదు. కానీ, కోవిడ్ బారినపడిన కొంతమందికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బాధిస్తుండడం ఇప్పుడు అందర్నీ భయపెడుతుంది. కోవిడ్ ఎఫెక్ట్ వల్ల కొంతమందిలో గుండె బలహీనపడడం, లంగ్స్ దెబ్బతినడం, ఇమ్యూనిటీ తగ్గడం వంటివి డాక్టర్లు గుర్తించారు. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్లు కొన్ని లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.
రీసెంట్‌గా లాంగ్ కోవిడ్ ఎఫెక్ట్స్‌పై టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల చేసిన ట్వీట్ ఇప్పుడు చాలామందిని అప్రమత్తం చేస్తోంది. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దని, చిన్న తప్పుతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన ట్వీట్ చేశారు. “కొన్ని వారాలుగా మా కజిన్ జ్వరంతో బాధపడుతున్నారు. అది నార్మల్ ఫీవర్ అనుకున్నాము. దాంతో సమయానికి డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు. అది కాస్తా అరుదైన జీబీ సిండ్రోమ్‌గా మారింది. ఆలస్యం చేయడం వల్ల జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నిర్లక్ష్యం మా కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది. కొవిడ్ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకుంటున్నారు. దయచేసి అలా చేయొద్దు”ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
అప్పట్లో కొవిడ్ సోకిన చాలామందిలో ఇప్పుడు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటున్నాయి. వీటిలో ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొవిడ్ సోకిన వాళ్ల ఊపిరితిత్తులు, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా బలహీన పడుతున్న కేసులు కూడా కనిపిస్తున్నాయి.
లాంగ్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఏ రూపంలో కనిపిస్తాయో చెప్పలేం. కాబట్టి సాధారణ జ్వరాలు, గుండెనొప్పి, ఆయాసం వంటివి వచ్చినప్పుడు ఇంటి వైద్యం చేసి ఊరుకోకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఆయాసం, శ్వాస అందకపోవడం వంటి సమస్యలను తేలిగ్గా తీసుకోకూడదని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే ఛాతినొప్పి, ఎడమ భుజంలో నొప్పి, వెన్ను నొప్పి లాంటి లక్షణాలు గుండెపోటుకి సంకేతాలు అవ్వొచ్చు. కాబట్టి వాటి విషయంలో అశ్రద్ధ వహించొద్దని సూచిస్తున్నారు.
వీటితోపాటు డయేరియా, కడుపు నొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, నిద్రలేమి, దగ్గు, దీర్ఘకాలం జలుబు వంటివి కూడా లాంగ్ కోవిడ్ లక్షణాల్లో భాగంగా ఉన్నాయి. వీటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం అవసరం.
లక్షణాలపై ఓ కన్నేసి ఉంచుతూనే ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా పాటిస్తుండాలి. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్లు ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు తీసుకుంటుండాలి. రోజూ కొంత వ్యాయామం చేయాలి. డయాబెటిస్ ఉన్నవాళ్లు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి అసౌకర్యం తలెత్తినా తేలిగ్గా తీసుకోకుండా ఒకసారి డాక్టర్‌ను కలిసి సమస్యను నిర్ధారించుకుంటే మంచిది.