Telugu Global
Health & Life Style

నడుం నొప్పికి నడకే మంత్రం

నడుం నొప్పి సమస్యకు నడక ఉత్తమ పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మెక్వారీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది.

నడుం నొప్పికి నడకే మంత్రం
X

నడుము నొప్పి అనేది ఈ రోజుల్లో ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఏ పని చేసేవారైనా , ఏ వయసువారైన నడుం నొప్పయిబారిన పడ్డారు అంటే ఇంక జీవితాంతం అబ్బా.. అయ్యో అంటూ ఉండాల్సిందే .. అయితే ఇప్పటి వరకు నడుం నొప్పి వస్తే నిటారుగా పడుకోవాలి, లేదంటేఈ వ్యాయామాలు చేయాలి ఈ ఆసనం వేయాలి అని విన్నాం. కానీ ఆస్ట్రేలియాలోని మక్వారీ యూనివర్సిటీ పరిశోధకుల తాజా పరిశోధనలో ఒక అద్భుతమైన విషయం వెల్లడైంది .. అదేంటంటే ప్రతి రోజూ కొంతసేపు చేసే వాకింగ్‌తో వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట. అంతే కాదు ఒక నిర్ణీత పద్ధతిలో నడిచే నడక నడుం నొప్పిని చాలావరకు తగ్గిస్తుంది. వారానికి 5 రోజుల పాటు నడిస్తే చాలు, వెన్నునొప్పి వెనక్కి తిరిగి రానే రాదట.

నిజానికి చాలామంది నడుం నొప్పికి మరీ ముఖ్యంగా వెన్ను కింది భాగంలో వచ్చే నొప్పికి వ్యాయామాలు చేయడం లేదా ఫిజియో థెరపీ లాంటి మార్గాలను అన్వేషిస్తున్నాం. కానీ నడుం నొప్పి సమస్యకు నడక ఉత్తమ పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మెక్వారీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది.

సుమారు 700 మందిపై జరిగిన ఈ అధ్యయనంలో పాల్గొన్న వారంతా ఆరు నెలల పాటు నడకను కొనసాగించిన తర్వాత మూడేళ్ల నుంచి వారిని వేధిస్తున్న వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభించిందని తెలిపారు. వాకింగ్ చేసిన వారిలో మళ్లీ వెన్నునొప్పి వచ్చే అవకాశం 28 శాతం తగ్గినట్లు పరిశోధకులు తెలిపారు.

అలాగే వీరు వెన్నునొప్పితో డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం కూడా రాలేదని చెప్పారు. అయితే వెన్నునొప్పిని తగ్గించేందుకు నడక ఉపయోగపడింది అని చెప్పగలం గానీ అది ఎందుకు అంత ప్రభావవంతంగా ఉంటుందోమాత్రం కచ్చితంగా చెప్పలేమని అధ్యయనకర్తలు అంటున్నారు. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం, ప్రపంచంలో 62 కోట్లమంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు.

ఏదైతేనేం వ్యాయామం, తగినంత నడక గుండెకు మంచి ఆరోగ్యాన్ని, మెరుగైన మానసిక స్థితిని, సరిపోయేంత నిద్రని ఇస్తాయన్నది మరోసారి తెలిసింది కాబట్టి మన ఆరోగ్యం మన నడకలో ఉన్నట్టే.

First Published:  22 Jun 2024 1:46 PM IST
Next Story