Telugu Global
Health & Life Style

కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు పోశ్చర్ ఇలా ఉండాలి!

కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు బాడీ పోశ్చర్ ముఖ్య కారణంగా ఉంటోంది.

కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు పోశ్చర్ ఇలా ఉండాలి!
X

కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు పోశ్చర్ ఇలా ఉండాలి!

కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు బాడీ పోశ్చర్ ముఖ్య కారణంగా ఉంటోంది. వర్క్ చేసేటప్పుడు శరీర భంగిమ ఎలా ఉండాలంటే..

ఆఫీసు లేదా ఇంట్లో కంప్యూటర్‌పై పని చేసేటప్పుడు తెలియకుండా వెన్నెముక ముందుకి వంచడం, మెడను ముందుకి వాల్చడం వంటివి చేస్తుంటారు. అంతేకాదు, ఆఖరికి సెల్‌ఫోన్లను వాడేటప్పుడు కూడా ఇలాంటి పోశ్చర్లే ఉంటుంటాయి. ఇలాంటి బ్యాడ్ పోశ్చర్ల వల్ల లాంగ్ టర్మ్‌లో సమస్యలు రాకూడంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేసేటప్పుడు కుర్చీలో పూర్తిగా వెనక్కి జరిగి వెన్నెముకను కుర్చీ వెనుక భాగానికి ఆన్చి వెన్ను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు, ప్రతి అరగంటకోసారి భంగిమను గమనిస్తుండాలి. తెలియకుండా వెనక్కి వాలిపోవడం లేదా ముందుకి వంగిపోవడం వల్ల నడుము పట్టేయడం, బ్యాక్ పెయిన్ వంటి సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి గంటల తరబడి కూర్చుని పనిచేసేటప్పుడు తరచూ వెన్నెముక పోశ్చర్‌‌ను గమనించుకుంటుండాలి.

సాధారణంగా తల బరువు నాలుగైదు కిలోలు ఉంటుంది. తలను మెడపై సరిగ్గా బ్యాలెన్స్‌ చేయగలిగితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అలాకాకుండా తరచూ ముందుకు, వెనక్కి వంచి ఉంచడం మెడ మీద అదనపు భారం పడుతుంది. దీనివల్ల క్రమంగా మెడనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలొస్తాయి. అందుకే సిస్టమ్ ముందు కూర్చున్నా, మొబైల్ వాడుతున్నా మెడ పొజిషన్ ఎలా ఉందో గమనిస్తుండాలి. అలాగే పడుకుని ఎత్తైన దిండు తలకింద పెట్టుకుని ల్యాప్‌టాప్ లేదా మొబైల్ చూస్తుంటారు కొంతమంది. దీనివల్ల కూడా మెడ పట్టేసే ప్రమాదముంది. వర్క్ చేయడానికి కుర్చీలో లేదా కింద కూర్చోవడం ఉత్తమం. కళ్లకు స్ట్రైట్ లైన్‌లో స్క్రీన్‌ ఉండేలా చూసుకుంటే మెడ పొజిషన్ ఆటోమేటిక్‌గా నిటారుగా ఉంటుంది.

ఇకపోతే వర్క్ చేసేటప్పుడు టైప్‌ చేయడం కోసం వేళ్లను ఎక్కువగా కదిలించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు వేళ్లపై ఎక్కువ భారం పడకూడదంటే ప్రతీ అరగంటకోసారి వేళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. టైప్ చేసేటప్పుడు చేతులను మరీ ఎత్తులో ఉంచకూడదు. భుజాలు రిలాక్స్‌గా ఉంచి టైప్ చేసేలా పొజిషన్ సెట్ చేసుకోవాలి.

గంటల తరబడి వర్క్ చేసేటప్పుడు ఏదైనా అవయవంపై ఒత్తిడి పడినట్టు గమనిస్తే.. పోశ్చర్ తప్పుగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అవయవాలు ఒత్తిడికి లోనవ్వకుండా, కళ్లు స్ట్రెయిన్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వర్క్ చేయడాన్ని అలవర్చుకోవాలి.

First Published:  16 Oct 2023 5:15 PM IST
Next Story