Telugu Global
Health & Life Style

చదవండి... ఎక్కువకాలం జీవించండి

ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలని ఎవరికి ఉండదు చెప్పండి... అందుకే ఇప్పటికీ ఆయుష్షుని పెంచే అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

చదవండి... ఎక్కువకాలం జీవించండి
X

ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలని ఎవరికి ఉండదు చెప్పండి... అందుకే ఇప్పటికీ ఆయుష్షుని పెంచే అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చాలా తేలికపాటి మార్గాలతోనే దీర్ఘఆయుష్షుని పెంచుకోవచ్చని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అలాంటిదే ఇది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు చదవని వారికంటే ఎక్కువకాలం జీవిస్తారని ఓ అధ్యయనంలో తేలింది. యాభై ఏళ్లు పై బడిన 3,600 మందిపై దీర్ఘకాలం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం రుజువైంది.

వార్తాపత్రికలు, మ్యాగజైన్లు చదివినా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చట. రోజుకి కనీసం అరగంటపాటు చదివినా జీవితకాలం పెరుగుతుందని తెలుస్తోంది. వారానికి మూడున్నర గంటల పాటు చదివేవారు అసలు చదవని వారికంటే రెండు సంవత్సరాల కాలం ఎక్కువగా జీవిస్తారని పరిశోధకులు అంటున్నారు. చదవటం అనేది మెదడు శక్తిని పెంచే ప్రక్రియ కావటం వలన ఈ ప్రయోజనం లభిస్తుందని వారు భావిస్తున్నారు.

సిగరెట్లకు దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన స్థాయిలో శరీర బరువుని కలిగి ఉండటం, తాజాపళ్లు కూరగాయలు నట్స్ చేపలు తృణధాన్యాలు చేపలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవటం, వారంలో కనీసం ఐదురోజులు అరగంటపాటు వ్యాయామం చేయటం... జీవితకాలాన్ని పెంచడంలో ప్రథానంగా తోడ్పడుతున్న ఇతర అంశాలు.


ఏకాగ్రతగా పనులు చేయటం, పరధ్యానంగా కాకుండా చైతన్యస్పృహతో జీవించడం, మంచి స్నేహితులను కలిగి ఉండటం, అలసిపోయినప్పుడు చిన్నపాటి కునుకు తీయటం, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఉన్న పళ్లు కూరగాయలు ఎక్కువగా తినటం, వివాహ బంధంలో ఉండటం, దైవ పరమైన సేవాకార్యక్రమాలలో పాల్గొనటం, మనసులో ద్వేషభావాలు నింపుకోకుండా క్షమించే తత్వంతో ఉండటం, హెల్మెట్, సీట్ బెల్ట్ వాడటం, రోజుకి ఏడునుండి ఎనిమిది గంటలు నిద్రపోవటం, ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయటం, జీవితానికి లక్ష్యాలుండటం... ఇవన్నీ కూడా మన జీవితకాలాన్ని పెంచే అంశాలే. అలాగే వీటికి వ్యతిరేకమైన పనులు ఆయుష్షుని తగ్గిస్తాయని కూడా చెప్పవచ్చు.

First Published:  8 Sept 2022 1:47 PM IST
Next Story