Telugu Global
Health & Life Style

పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? ఇది తెలుసుకోండి!

పెయిన్ కిల్లర్స్ అనేవి మెదడుకి నొప్పిని తెలియకుండా చేయడంలో సాయపడతాయి. అంతేకానీ, అవి పూర్తిగా నొప్పిని తగ్గించవు.

పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? ఇది తెలుసుకోండి!
X

డాక్టర్ అవసరం లేకుండా వాడే మందుల్లో పెయిన్ కిల్లర్స్ ముందువరుసలో ఉంటాయి. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ చాలామంది ఇళ్లల్లో కామన్‌గా కనిపిస్తుంటాయి. ఏదైనా నొప్పి కలగగానే వెంటనే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటుంటారు. అయితే ఈ అలవాటు వల్ల చాలా ప్రమాదముందంటున్నారు డాక్టర్లు.

తరచుగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడడం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండడంతోపాటు శరీరంలో పలు అవయవాలు కూడా పాడవుతాయి. అసలు పెయిన్ కిల్లర్స్ ఎందుకు వాడకూడదంటే..

పెయిన్ కిల్లర్స్ అనేవి మెదడుకి నొప్పిని తెలియకుండా చేయడంలో సాయపడతాయి. అంతేకానీ, అవి పూర్తిగా నొప్పిని తగ్గించవు. కాబట్టి వీటిని అదేపనిగా వాడితే మనకు తెలియకుండానే శరీర అవయవాలు పాడయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా లివర్, కిడ్నీలపై ఈ మందుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

పెయిన్‌కిల్లర్‌ టాబ్లెట్స్‌లో ఉండే రసాయనాలను ఫిల్టర్ చేయడానికి కిడ్నీలు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. అందుకే పెయిన్‌కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీలపై ఎక్కువ. అలాగే శరీరంలో టాక్సిన్స్‌ను వేరు చేసే లివర్ కూడా పెయిన్ కిల్లర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది.

పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ల వల్ల రక్తనాళాల చివళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి హైబీపీ, గుండె సమస్యలతో బాధపడేవాళ్లు పెయిన్ కిల్లర్స్ తరచుగా వేసుకోవడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే పరగడపున పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే పొట్టలో ఉండే పొరలు దెబ్బతిని రకరకాల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

జాగ్రత్తలు ఇలా..

పెయిన్ కిల్లర్స్‌ను ఇష్టప్రకారం వాడకూడదు. సమస్యను బట్టి డాక్టర్‌‌ను సంప్రదించాకే మందులు వాడాలి. అది కూడా నిర్ధేశించిన కోర్సు టైం వరకే వాడి ఆ తర్వాత మానుకోవాలి.

పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్లు పోషకాహారం తీసుకుంటూ ఎక్కువ నీరు తాగుతుండాలి. దీనివల్ల టాక్సిన్స్ ఎఫెక్ట్ కొంత వరకూ తగ్గుతుంది.

బీపీ, గుండె జబ్బులున్నవాళ్లు డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్లకూడదు.

లాంగ్ టర్మ్‌లో పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వచ్చినవాళ్లు కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, బీపీ పరిక్షలు చేసుకుంటుండాలి. ఏవైనా తేడాలు గమనిస్తే డాక్టర్‌‌ను సంప్రదించాలి.

First Published:  27 Jun 2024 1:00 PM IST
Next Story