Telugu Global
Health & Life Style

ఆ పేపరులో పెట్టిన ఆహారం... అనారోగ్యం

సాధారణంగా చాలామంది చిరువ్యాపారులు, కొంతమంది టిఫిన్ సెంటర్ల వాళ్లు తాము అమ్మే ఆహార పదార్థాలను వార్తాపత్రికల తాలూకూ పేపర్లలో పెట్టి వినియోగదారులకు అందిస్తుంటారు.

ఆ పేపరులో పెట్టిన ఆహారం... అనారోగ్యం
X

ఆ పేపరులో పెట్టిన ఆహారం... అనారోగ్యం

సాధారణంగా చాలామంది చిరువ్యాపారులు, కొంతమంది టిఫిన్ సెంటర్ల వాళ్లు తాము అమ్మే ఆహార పదార్థాలను వార్తాపత్రికల తాలూకూ పేపర్లలో పెట్టి వినియోగదారులకు అందిస్తుంటారు. అయితే ఇలాంటి పేపర్లలో ఉంచిన ఆహారాలను తినటం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుందని, వ్యాపారులు వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి, నిల్వ చేయడానికి, వడ్డించడానికి వార్తా పత్రికలను వాడటం మానేయాలని ఆ సంస్థ కోరింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈఓ జి కమల వర్దనరావు ఆహార పదార్థాల అమ్మకంలో వార్తా పత్రికల వినియోగాన్ని ఆపేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వార్తా పత్రికల ప్రచురణకోసం వాడే ఇంకులో బయో యాక్టివ్ పదార్థాలు ఉంటాయని ఇవి ఆహారాలను కలుషితం చేసి ఆరోగ్యానికి హాని చేస్తాయని, ఇవే కాకుండా వార్తా పత్రికల ప్రచురణకోసం వాడే ఇంకులలో సీసం, భారీ లోహాలు వంటి హానికరమైన రసాయనాలు కూడా ఉంటాయని అవి దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.

వార్తపత్రికలు పంపిణీ సమయంలో రకరకాల వాతావరణ కాలుష్యాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇవి పంపిణీ సమయంలో పలురకాల కలుషిత ప్రదేశాల్లో, వాతావరణాల్లో ఉండటం వలన వాటిపై బ్యాక్టీరియా, వైరస్ లు, ఇతర రోగకారక క్రిములు చేరే అవకాశం ఉంటుంది. ఇవి పేపరునుండి ఆహారంలోకి చేరి... కలుషిత ఆహారం వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలను తెచ్చిపెడతాయని ఈ సంస్థ పేర్కొంది.

వార్తా పత్రికల ద్వారా జరిగే ఆరోగ్య హానిని అపడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ... ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ (ప్యాకేజింగ్) రెగ్యులేషన్స్ 2018 చట్టాన్ని చాలా కచ్ఛితంగా అమలు చేస్తోంది. దీని ప్రకారం ఆహార నిల్వ, సరఫరా వంటి విషయాల్లో వార్తాపత్రికల వినియోగాన్ని నిషేధించారు. ఆహార పదార్థాలను అమ్మేవారు వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పదార్థాల ప్యాకింగ్ విషయంలో బాధ్యతగా ఉండాలని కమలా వర్దనరావు కోరారు.

First Published:  5 Oct 2023 5:30 AM
Next Story