చైనాలో మరో కొత్త వైరస్
కరోనా పుట్టిన చైనా నుంచి ఇప్పుడు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. జంతువుల నుంచి వ్యాపించే 'లాంగ్యా హెనిపా' అనే వైరస్‌ను ఇటీవల చైనా సైంటిస్టులు కనుగొన్నారు.
కరోనా పుట్టిన చైనా నుంచి ఇప్పుడు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. జంతువుల నుంచి వ్యాపించే 'లాంగ్యా హెనిపా' అనే వైరస్‌ను ఇటీవల చైనా సైంటిస్టులు కనుగొన్నారు. చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో 35 మందికి 'లాంగ్యా హెనిపా' వైరస్ సోకినట్టు అక్కడి అధికారులు గుర్తించారు.
జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇది ఒకరి నుంచి మరొరరికి సోకుతుందా? లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. హెనాన్, షాన్‌డాంగ్ ప్రావిన్సుల్లోని ఎలుకల్లా ఉండే ష్రూస్‌ల్లో ఈ వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ కుక్కలు, మేకల్లో కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ వైరస్ గబ్బిలాల్లో కనిపించే ప్రాణాంతక నిఫా వైరస్ కుటుంబానికి చెందింది. ఈ వైరస్‌తో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.
హెనిపా వైరస్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది జ్వరం బారిన పడినట్లు సైంటిస్టులు గుర్తించారు. లాంగ్యా వైరస్ బారిన పడిన 50 శాతం మందిలో దగ్గు, 54 శాతం మందిలో అలసట, సగం మందిలో ఆకలి లేకపోవడం, కండరాల నొప్పులు లాంటి లక్షణాలు గుర్తించారు. వీటీతోపాటు వాంతులు, ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోవడం, కాలేయం, మూత్రపిండాల సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఈ వైరస్‌తో 40 నుంచి 75శాతం వరకు మరణించే అవకాశాలుంటాయని స్టడీలు చెప్తున్నాయి.
ఇకపోతే హెనిపావైరస్ వ్యాప్తి నివారణకు ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. లక్షణాలకు ఉపశమనం కల్పించే చికిత్సలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ వైరస్ సోకిన బాధితులంతా సేఫ్‌గానే ఉన్నారు. మనషులపై ఈ వైరస్ ఎంతమేరకు పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.