Telugu Global
Health & Life Style

సీఈవోలకు కొత్త జబ్బు.. పొడవు పెరిగేందుకు ఆపరేషన్లు...

ఇటీవల కాలంలో పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, ఉన్నత ఉద్యోగులు ఎత్తు పెరిగే ఆపరేషన్ల కోసం క్యూ కడుతున్నారట. అమెరికాకు చెందిన ఓ కాస్మెటిక్ సర్జన్ వెల్లడించిన వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

సీఈవోలకు కొత్త జబ్బు.. పొడవు పెరిగేందుకు ఆపరేషన్లు...
X

ఆహారం కోసం కష్టపడుతుంటారు పేదలు, ఆహార్యం కోసం కష్టాలు కొనితెచ్చుకుంటారు ధనవంతులు. గతంలో బేరియాట్రిక్ సర్జరీ పేరుతో చాలామంది ఊబకాయులు కడుపు కుట్టేసుకున్నారు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్, బొటాక్స్ ఆపరేషన్లు కూడా అందం కోసం, శరీరంలో మార్పుల కోసం డబ్బున్నోళ్లు చేయించుకునేవే. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి పొడవు పెరిగే ఆపరేషన్లు కూడా చేరాయి. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, ఉన్నత ఉద్యోగులు ఇలా ఎత్తు పెరిగే ఆపరేషన్ల కోసం క్యూ కడుతున్నారట. అమెరికాకు చెందిన ఓ కాస్మెటిక్ సర్జన్ వెల్లడించిన వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

70వేల అమెరికన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో ఈ ఆపరేషన్ కోసం దాదాపు 56 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 50 లక్షల నుంచి మొదలు పెడితే కోటి 20 లక్షల వరకు ఈ ఆపరేషన్ కోసం ఖర్చవుతుంది. కానీ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏమాత్రం వెనకాడ్డంలేదట. అమెజాన్, గూగుల్, మెటా వంటి సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా ఇటీవల కాలంలో తన వద్ద ఇలాంటి ఆపరేషన్లు చేయించుకున్నారని చెబుతున్నారు అమెరికా కాస్మెటిక్ సర్జన్.

ఎందుకీ ఆపరేషన్లు..?

ఎత్తు పెరిగితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కాదనలేం. కానీ కృత్రిమంగా ఎత్తు పెరిగితే ఏమొస్తుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మొదలైతే అప్పుడేం చేస్తారు. ఆపరేషన్ వికటిస్తే ప్రాణాలకే ప్రమాదం. కానీ ఇలాంటి ఆపరేషన్లకు ఎవరూ వెనకాడ్డంలేదు. కోటి రూపాయలు పెట్టడానికి సైతం సిద్ధంగా ఉన్నారంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వివిధ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు నలుగురిలో హుందాగా కనిపించేందుకు ఇలా చేస్తున్నారని అంటున్నారు డాక్టర్లు. టీమ్‌ని లీడ్ చేయాలన్నా, ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్లలో స్పెషల్‌గా కనిపించాలన్నా హైట్ తప్పనిసరి అనుకుంటున్నారు.

నెలరోజులు మంచంలోనే..

ఎత్తు పెరిగేందుకు చేయించుకునే ఆపరేష‌న్‌ చాలా క్లిష్టమైనది. ఈ ప్రక్రియలో వ్యక్త తొడ ఎముకలను పగలగొట్టి, వాటి మధ్య ప్రత్యేక మెటల్‌తో చేసిన కృత్రిమ ఎముకలను చొప్పిస్తారు. ఒకేసారి ఎత్తు పెంచకుండా నెల రోజుల పాటు ఆ కృత్రిమ ఎముకల్లో పెరుగుదల ఉంటుంది. మాగ్నెటిక్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ పద్ధతిని పర్యవేక్షిస్తారు. ఆపరేషన్ చేయించుకున్నవారు నెలరోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందే. అవసరమైతే మరో 10 రోజులు వారు విశ్రాంతిలోనే ఉండాలి. కాళ్ల నొప్పి వంటి సమస్యలు సర్వ సాధారణమే అయినా, ఇప్పుడున్న అధునాతన పద్ధతుల్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయగలుగుతామని వైద్యులు భరోసా ఇస్తున్నారు. కరోనా కాలంలో ఈ సర్జరీల జోరు పెరిగిందని చెబుతున్నారు వైద్యులు.

First Published:  18 Sept 2022 4:02 PM IST
Next Story