లాంగ్ కోవిడ్ బాధితులకు క్యాన్సర్‌ను మించి సమస్యలు
దీర్ఘకాల కోవిడ్ బాధితుల్లో ఎక్కువ మంది అలసటతో బాధపడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఇది ఎంతలా ఉందంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో స్థాయిలో ఉన్నప్పుడు ఓ బాధితుడు ఎంతలా అలసటకు గురవుతాడో అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టు తేలింది.
కోవిడ్ వైరస్ వదిలిపోయిందనుకుంటున్నా.. దాని బారినపడి దీర్ఘకాలం ఇబ్బందిపడి కోలుకున్నవారిలో దాని ప్రభావం వల్ల ఇంకా అనేక సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. దీర్ఘకాల కోవిడ్ బాధితుల్లో ఆరోగ్యం విషయంలో అనేక మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ (ఎస్ఐహెచ్ఐర్) జర్నల్లో కథనం ప్రచురితమైంది.
ఈ అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలం కోవిడ్‌తో బాధపడిన 3,750 మంది రోగులపై యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్), యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్‌టర్కికి చెందిన వైద్యులు పరిశోధనలు చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఆ తర్వాత ఆరోగ్యపరంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్న అంశంపై ఈ బృందం పరిశోధన చేసింది. ఇందులో భాగంగా బాధితుల నుంచి ఓ యాప్ ద్వారా సమాధానాలు రాబట్టారు. ఆందోళన, అలసట, మెదడు చురుకుదనం, నిరాశ తదితర అంశాలపై వారిని ప్రశ్నించారు.
దీర్ఘకాల కోవిడ్ బాధితుల్లో ఎక్కువ మంది అలసటతో బాధపడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఇది ఎంతలా ఉందంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో స్థాయిలో ఉన్నప్పుడు ఓ బాధితుడు ఎంతలా అలసటకు గురవుతాడో అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. బాధితుల జీవితాలపై కోవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని తమ అధ్యయనంలో వెల్లడైందని, దీని ప్రభావం వల్ల రోజువారీ కార్యకలాపాలను సజావుగా కొనసాగించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ హెన్రీ గుడ్ఫెలో వెల్లడించారు.
ఈ అధ్యయనంలో భాగంగా వివరాలు సేకరించినవారిలో 90 శాతం మంది 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే కావడం గమనార్హం. కోవిడ్ సోకిన తర్వాత మునుపటిలా పని చేయలేకపోతున్నామని అందులోని దాదాపు 51 శాతం మంది చెప్పారు. పూర్తిగా పని చేయలేకపోతున్నామని మరో 20 శాతం మంది తెలిపారు. మరోవైపు తమ వివరాలు పేర్కొన్న కోవిడ్ బాధితుల్లో 71 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. దీనిని బట్టి కోవిడ్ వదిలిపోయిందనుకుంటున్నా.. దాని ప్రభావం వల్ల దీర్ఘకాల కోవిడ్ బాధితుల్లో ఇంకా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయని అర్థమవుతోంది.