Telugu Global
Health & Life Style

ఎముకలు బలహీన పడటానికి కారణం ఏంటి? బోలు ఎముకల వ్యాధి ఎందుకు వస్తుంది?

ఆస్టియోపోరోసిస్ వ్యాధి స్త్రీ, పురుషులతో సమానంగా కనిపిస్తుంటుంది. తుంటి, మణికట్టు, వెన్నెముకపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఎముకలు బలహీన పడటానికి కారణం ఏంటి? బోలు ఎముకల వ్యాధి ఎందుకు వస్తుంది?
X

మనకు వయసు పెరిగే కొద్దీ అనేక రకాల శారీరిక సమస్యలు వస్తాయి. కొన్ని వ్యాధులు కూడా సంక్రమిస్తుంటాయి. అలాంటి వాటిలో బోలు ఎముకల వ్యాధి (Osteoporosis) కూడా ఒకటి. వృద్ధాప్యంలో ఎముకలు బలహీన పడటం సాధారణమే అయినా.. అవి ఒక పరిమితిని మించి దాటితే ప్రమాదకరంగా మారుతుంది. దీని కారణంగా ఎముకలు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎముకలు బలహీనపడటాన్నే బోలు ఎముకల వ్యాధి లేదా ఆస్టియోపోరోసిస్ అంటారు.

ఆస్టియోపోరోసిస్ వ్యాధి స్త్రీ, పురుషులతో సమానంగా కనిపిస్తుంటుంది. తుంటి, మణికట్టు, వెన్నెముకపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సకాలంలో నివారణ చర్యలు తీసుకోకపోతే ఒక వయసు తర్వాత ఎముకలకు సంబంధించి అనేక సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా ఆస్టియోపోరోసిస్ లక్షణాలు వెంటనే మనకు అర్థం కావు. అయితే బోన్స్ డ్యామేజ్ అవడం మొదలు పెట్టిన తర్వాత కొన్నాళ్లకు దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

మన శరీరంలోని ఎముకలకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే..అవి ఎప్పుడూ పునరుద్దర చెందుతూ ఉంటాయి. అంటే ఎముకలు విరిగిపోయినా.. అవి అతుక్కుంటాయి. చిన్న సమ్యలు వచ్చినా దానంతట అవే సరి చేసుకుంటుంటాయి. లివర్ తర్వాత తనంతట తానుగా బాగుపడే లక్షణం ఎముకలకే ఉంటుంది. పుట్టినప్పటి కంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలపడతాయి. అనేక చిన్న ఎముకలు కలిసిపోయి కొత్త ఎముకలుగా మారతాయి. 30 ఏళ్ల వయసు వచ్చే సరికి మన ఎముకల బరువు పెరగడం ఆగిపోతుంది. ఇక అప్పటి నుంచి మన వాటిని కాపాడుకుంటూ ఉండాలి. ఎముకలో అనేక ఖనిజాలు ఉంటాయి. అవి పుష్కలంగా ఉన్నప్పుడే ఎముక బరువుగా, దృఢంగా ఉంటుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ఖనిజాల లోపం కారణంగా ఎముకలు బలహీనపడతాయి. స్త్రీలలో మోనోపాజ్ స్థితిలో ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. 40 నుంచి 50 ఏళ్ల వయసు గల మహిళల్లో హార్మోన్ల మార్పు జరిగి మోనోపాజ్ స్థితి వస్తుంది. అప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే విటమిన్ డి లోపం కారణంగా కూడా బోలు ఎముకల వ్యాధి వస్తుంది. శరీరంలో కాల్షియం లోపం, జన్యు సంబంధిత కారణాల వల్ల కూడా ఎముకలు బలహీన పడతాయి. క్యాన్సర్ చికిత్స, హైపర్ థైరాయిడ్, ధూమపానం, పొగాకు నమలడం, అతిగా మద్యం సేవించడం వల్ల ఆస్టియోపోరోసిస్ సంక్రమిస్తుంది.

మన జీవిన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నయం చేసుకునే వీలుంది. ఆస్టియోపోరోసిస్ కూడా ఆ కోవలోకే వస్తుంది. పాలు, పాలతో చేసిన ఆహారం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. దీంతో ఎముకలు గట్టి పడతాయి. చీజ్, పెరుగు, నాన్‌ఫ్యాటీ మిల్క్ ఎక్కువగా తీసుకుంటే దానిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు శరీరానికి మంచిది. వీటిలో ఉండే ఐరన్ ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. ప్రతీ రోజు ఏదో ఒక ఆకు కూర తినడానికి ప్రాధ్యానత ఇస్తే మంచిది. ఇలా చేయడం వల్ల ఆస్టియోపోరోసిస్‌ను నివారించవచ్చు.

ఒక వేళ ఆస్టియోపోరోసిస్ ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. విటమిన్లు, కాల్షియం వంటి లోపాలను వైద్యులు సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా సరిదిద్దుతారు. చికిత్స కంటే నివారణ మంచిది కాబట్టి.. కాల్షియం, విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవడం అందరికీ మంచిది.

First Published:  20 Oct 2022 5:33 PM IST
Next Story