Telugu Global
Health & Life Style

జంక్ ఫుడ్ ఇలా తగ్గించుకోవచ్చు!

ఇప్పుడొస్తున్న చాలా అనారోగ్య సమస్యలకు అతిగా తినడం, జంక్ ఫుడ్ తినడమే కారణమని డాక్టర్లు చెప్తున్నారు. తీపి, పులుపు, కారం లాంటి కొన్ని రుచులను నాలుక పదేపదే కోరుకోవడం వల్ల చాలామందికి ఆకలి లేకపోయినా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి.

జంక్ ఫుడ్ ఇలా తగ్గించుకోవచ్చు!
X

జంక్ ఫుడ్ ఇలా తగ్గించుకోవచ్చు!

ఇప్పుడొస్తున్న చాలా అనారోగ్య సమస్యలకు అతిగా తినడం, జంక్ ఫుడ్ తినడమే కారణమని డాక్టర్లు చెప్తున్నారు. తీపి, పులుపు, కారం లాంటి కొన్ని రుచులను నాలుక పదేపదే కోరుకోవడం వల్ల చాలామందికి ఆకలి లేకపోయినా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. దీన్నెలా తగ్గించుకోవచ్చంటే..

ఫుడ్‌ క్రేవింగ్స్ అంటే ఆకలితో పని లేకుండా తినాలన్న కోరిక ఉండడం. ఇలాంటి క్రేవింగ్స్‌ వచ్చినప్పుడు చాలామంది పిజ్జా, బర్గర్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చిప్స్‌, ఐస్‌క్రీమ్స్‌ వంటి జంక్ ఫుడ్స్‌ తింటుంటారు. మూడ్‌ స్వింగ్స్‌, పని ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఫుడ్‌ క్రేవింగ్స్‌ పెరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో జంక్‌ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీల శాతం పెరుగుతుంది. దానివల్ల బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఫుడ్ క్రేవింగ్స్ అదుపులో ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. తరచుగా నీళ్లు తాగుతుండడం వల్ల ఊరికే ఏదో ఒకటి తినాలన్న కోరిక తగ్గుతుంది.

బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ చేసేటప్పుడు తగినంత మోతాదులో తినేయాలి. కొద్దిగా తింటూ ప్రతీ మీల్‌కు మధ్య ఎక్కువ గ్యాప్‌ ఇవ్వడం వల్ల మనసు ఇతర ఆహార పదార్థాలపైకి మళ్లుతుంది. అందుకే మీల్ టైంలో ఎక్కువగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. రెండు మీల్స్‌కు మధ్యలో ఏదైనా తినాలనిపించినప్పడు బాదం, వాల్‌నట్స్‌, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి.

ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయని డాక్టర్లు చెప్తున్నారు. చూయింగ్‌ గమ్‌ నమిలే అలవాటు కూడా క్రేవింగ్స్‌ను తగ్గిస్తుందట.

కార్బొహైడ్రేట్లతో పోలిస్తే ప్రొటీన్లు , ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి.

రాత్రి పూట తగినంత నిద్రపోయే వారికి ఆహార కోరికలు తక్కువగా ఉంటాయని కొన్ని స్టడీల్లో తేలింది. రాత్రి పూట మెలకువతో ఉండేవాళ్లు టైం కాని టైంలో జంక్ ఫుడ్ తింటుంటారు. ఈ అలవాటు వల్ల చాలా సమస్యలు కొనితెచ్చుకున్నట్టే.

ఆహార కోరికలను అదుపులో ఉంచుకోవాలంటే జంక్‌ఫుడ్స్‌ను దూరంగా ఉంచాలి. ఇంట్లో చిప్స్, కుకీస్‌, ఐస్‌క్రీమ్స్ వంటివి స్టోర్‌ చేసుకోకుండా చూసుకోవాలి. స్నాక్స్ కోసం నట్స్, డ్రై ఫ్రూట్స్‌ను ఉంచుకోవాలి.

మానసిక ఒత్తిడి, భావోద్వేగాలు కూడా ఫుడ్ క్రేవింగ్స్‌కు కారణాలే. తరచూ ఒత్తిడి, ఆందోళనకు గురయ్యేవాళ్లు, మనసులో కలతగా ఉండేవాళ్లు తినాల్సిన దానికంటే ఎక్కువగా తింటుంటారని మానసిక నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి.

First Published:  17 Dec 2022 6:43 PM IST
Next Story