తలలో దురదను ఇలా తగ్గించొచ్చు!
ముఖ్యంగా తలలో చుండ్రు సమస్య ఉన్నవాళ్లకు తరచూ దురద పెడుతూ ఉంటుంది.
చెమట, ఎలర్జీల వంటి కారణాల వల్ల చాలామందికి తరచుగా తలలో దురద పెడుతుంటుంది. ఏదైనా మీటింగ్‌లో ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు ఇలా దురద పెడితే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు తలలో దురదకు కారణాలేంటి? దాన్ని ఎలా తగ్గించొచ్చు?
ముఖ్యంగా తలలో చుండ్రు సమస్య ఉన్నవాళ్లకు తరచూ దురద పెడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్లు రోజూ గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం, జుట్టు పొడవుని తగ్గించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
మాడుపై ఏవైనా అలర్జీలు వచ్చినప్పుడు కూడా తల దురద పెట్టడం సహజం. దీనికోసం వేపాకులను వేడినీటిలో మరిగించి ఆ నీటిని స్నానం చేసేనీళ్లలో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ అలర్జీలు తగ్గుతాయి.
ఎండాకాలం పట్టే చెమట కారణంగా కూడా తలమీది చర్మం పాడవుతుంది. చెమట కాయలు, వేడి పొక్కులు లాంటివి వచ్చినప్పుడు తలలో ఎంతో చిరాకుగా అనిపిస్తుంది. అందుకే ఎండాకాలం తక్కువ జుట్టు ఉండేలా చూసుకోవాలి. తరచుగా తలస్నానం చేస్తుండాలి.
దురదను తగ్గించేందుకు తలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. జుట్టులో ఎలాంటి తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. తలమీది చర్మానికి గాలి ఆడితేనే హెల్దీగా ఉంటుంది. దురద సమస్య బాగా వేధిస్తుంటే ఉప్పు, పులుపు, కారం, స్వీట్స్ వంటి వాటిని తగ్గించాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.