మధుమేహం- మామిడి పండు
పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జంక్ ఫుడ్, నూనె పదార్థాలు తినకుండా పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవిలో మామిడి పండ్ల మీద మనసు పారేసుకోని మనుషులు ఉండరు. వేలరకాల మామిడి పండ్లను ప్రపంచంలో సగానికిపైగా మన దేశమే ఉత్పత్తి చేస్తోంది. మంచి రంగు, అమోఘమైన వాసన, నోరూరించే ఈ పండ్లు ఎంత తిన్నా తనివి తీరదు. పండ్లు అన్నింటిలోకి రారాజు మామిడి పండు . అందుకే దీనికి డిమాండ్ కూడా ఎక్కువే కానీ డయాబెటిక్ పేషెంట్స్‌కు మాత్రం మామిడి పండ్లు తినాలా వద్దా.. అనే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ని ఈ స్టోరీలో తీర్చుకునే ప్రయత్నం చేద్దాం.
పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జంక్ ఫుడ్, నూనె పదార్థాలు తినకుండా పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని పండ్లను తినకూడదని వైద్యులు అంటున్నారు. నిజానికి మామిడిపండు సహా ఏ ఫలమైనా మధుమేహం నియంత్రణలో ఉన్నవారికి నిషిద్ధమేమీ కాదు. చాలా పండ్లలో ఫైబర్ ఉంటుంది. దీంతో వాటిలోని చక్కెర రక్తంలో కలిసే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అయితే, రక్తంలో చక్కెర స్థాయుల గురించి సమాచారం సరిగ్గా లేకపోయినా, చక్కెర స్థాయులు ఎక్కువగా ఉన్నా కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే మామిడిపండ్లను దూరం పెట్టడమే మంచిది.
డయాబెటిస్ ఉన్నవారు మామిడిపండ్లను తినాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మామిడిలో సహజంగానే చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి మామిడి పండ్లు తినే రోజు గుడ్లు లేదా నట్స్ వంటివి అధికంగా తినండి. అలా చేయడం వల్ల వాటిలో ఉండే ప్రోటీన్లు, ఫైబర్లు ఆహారాన్ని సమతుల్యం చేస్తాయి. అలాగే మామిడిపండు తినడానికి ముందు మీ షుగర్ లెవెల్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి. అవి సాధారణంగా ఉంటే మామిడిపండును ధైర్యంగా తినండి.
ఎప్పుడూ మామిడిపండును భోజనం తర్వాత డెజర్ట్‌గా తీసుకోవద్దు. అప్పటికే కేలరీలు, కార్బొహైడ్రేట్లు శరీరంలో చేరిపోయి ఉంటాయి కాబట్టి.. పొట్టమీద మరింత భారం పడుతుంది. బ్రేక్‌ఫాస్ట్ – మధ్యాహ్న భోజనం మధ్యలో కానీ, మధ్యాహ్న భోజనం – రాత్రి భోజనం మధ్యలో కానీ తీసుకుంటే మంచిది. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక స్నాక్స్ స్థానాన్ని మామిడిపండుతో భర్తీ చేసుకోవచ్చు. క్యాన్డ్ మామిడి రసంలో చక్కెరలు ఎక్కువ. పోషకాలు తక్కువ. కాబట్టి, తాజా పండ్లే ఉత్తమం.