Telugu Global
Health & Life Style

నోటి దుర్వాసన కిడ్నీల సమస్యకు సంకేతమా? నిపుణులు ఏం చెప్తున్నారు?

శరీరంలో బ్లడ్ యూరియా నైట్రోజన్ (బీయూఎన్) ఎక్కువగా ఉంటే కిడ్నీలు పాడవుతాయి. డీహైడ్రేషన్ వల్ల కూడా బీయూఎన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా పెరిగిన సమయంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది.

నోటి దుర్వాసన కిడ్నీల సమస్యకు సంకేతమా? నిపుణులు ఏం చెప్తున్నారు?
X

గుండె, ఊపిరితిత్తులు, కాలేయం తర్వాత అత్యంత ముఖ్యమైనవి మూత్రపిండాలు. మారుతున్న జీవన శైలి, ఆహారం కారణంగా మూత్రపిండాలపై కూడా ప్రభావం పడుతుంది. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల కారణంగా కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎవరికైనా అవసరం. మూత్రపిండాలు చెడిపోయిన విషయం చాలా ఆలస్యంగా కాని బయటకు తెలియదు. కాబట్టి నిత్యం వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు చెప్తున్నారు. బీపీ, షుగర్ కంట్రోల్‌లో పెట్టుకుంటే మూత్రపిండాల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవచ్చని అంటున్నారు.

మూత్రపిండాలు దెబ్బతింటే మన రక్తం నుంచి వ్యర్థాలు, ఇతర ద్రవాలను ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీంతో ఫాబ్రి అనే వ్యాధితో పాటు IgA నెఫ్రోపతి, లంపస్ నెఫ్రిటిస్, పాలిసిస్టిక్ వంటి కిడ్నీ వ్యాధులు ప్రబలుతుంటాయి. మూత్రపిండాలు దెబ్బతినడం మొదలు పెట్టిన మొదట్లో పైకి లక్షణాలు పెద్దగా కనపడవు. అయితే కొన్ని సంకేతాలు మాత్రం శరీరం తెలియజేస్తుంటుందని వైద్యులు చెప్తున్నారు. నోటి దుర్వాసన అనేది కిడ్నీల వ్యాధికి తొలి సంకేతం అని నిపుణులు అంటున్నారు. మూత్రపిండాల సమస్య కారణంగా శరీరంలో యూరియా అధికంగా పేరుకొని పోతుంది. యూరియా అధికం అయితే మన శ్వాస, రుచిని ప్రభావితం చేస్తుంది. ఖనిజాలను విసర్జించే సామర్థ్యం కూడా కోల్పోవడం వల్ల రక్తంలో అవి పేరుకొని పోతాయి. ఇవన్నీ నోటి దుర్వాసనకు కారణం అవుతాయి.

శరీరంలో బ్లడ్ యూరియా నైట్రోజన్ (బీయూఎన్) ఎక్కువగా ఉంటే కిడ్నీలు పాడవుతాయి. డీహైడ్రేషన్ వల్ల కూడా బీయూఎన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా పెరిగిన సమయంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు బీయూఎన్ పెరిగినట్లయితే ఆహారంలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి. రెడ్ మీట్, చేపలు, పాల ఉత్పత్తులు, బీన్స్, గింజలు, ధాన్యాలు వంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మానేయడం మంచింది. నీళ్లు ఎక్కువగా తాగడం, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవడం మన కిడ్నీలకు మేలు చేస్తుంది.

నోటి దుర్వాసన మాత్రమే కాకుండా కిడ్నీ వ్యాధులు వచ్చే అవకావం ఉంటే.. కడుపులో వికారం, వాంతులు, కండరాల తిమ్మిరి, ఆకలి లేకపోవడం, సాదాలు చీల మండల దగ్గర వాపు, దురద, శ్వాస ఆడకపోవడం, నిద్ర లేమి, అతి మూత్ర విసర్జన లేదా అత్యల్ప మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనపడతాయి. అందుకే ముందుగానే కిడ్నీ సమస్యలను గుర్తించి చికిత్స తీసుకుంటే.. వ్యాధి తీవ్రంగా మారకుండా చూసుకోవచ్చు.a a

First Published:  12 Oct 2022 7:12 PM IST
Next Story