Telugu Global
Health & Life Style

వెగన్ డైట్ మంచిదేనా? అందరూ పాటించొచ్చా?

వెగనిజం అనేది కేవలం డైట్ మాత్రమే కాదు. అదొక లైఫ్‌స్టైల్. అందుకే డైట్‌లోనే కాకుండా రోజువారీ వస్తువుల్లోనూ యానిమల్ బై ప్రొడక్ట్స్ లేకుండా చూసుకుంటారు. అయితే హెల్త్ పరంగా వెగన్ డైట్‌లో కొన్ని చాలెంజెస్ ఉన్నాయి.

వెగన్ డైట్ మంచిదేనా? అందరూ పాటించొచ్చా?
X

జంతు సంబంధిత పదార్థాలేవీ వాడకుండా అచ్చం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తింటూ, ప్లాంట్ బేస్డ్ వస్తువులను వాడే వెగన్ కల్చర్ ఇప్పుడు పాపులర్ అవుతోంది. అయితే అసలీ డైట్ ఎంత వరకు మంచిది? దీంతో ఏవైనా నష్టాలున్నాయా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వెగనిజం అనేది కేవలం డైట్ మాత్రమే కాదు. అదొక లైఫ్‌స్టైల్. అందుకే డైట్‌లోనే కాకుండా రోజువారీ వస్తువుల్లోనూ యానిమల్ బై ప్రొడక్ట్స్ లేకుండా చూసుకుంటారు. అయితే హెల్త్ పరంగా వెగన్ డైట్‌లో కొన్ని చాలెంజెస్ ఉన్నాయి. అవి తెలుసుకుని డైట్ ప్లాన్ చేసుకోవాలి.

ప్రొటీన్స్

డైట్‌ అనేది శరీరానికి కావాల్సిన అన్ని న్యూట్రియెంట్స్‌ను బ్యాలెన్స్ చేసేలా ఉండాలి. అయితే వెగన్ డైట్‌లో ఎక్కువగా పళ్లు, కూరగాయల వంటివే ఉంటాయి. ఈ డైట్‌లో జంతువుల నుంచి వచ్చిన పాలు, పాల పదార్థాలు కూడా తీసుకోరు. కాబట్టి వీళ్లు ప్రొటీన్ కోసం సెపరేట్‌గా నట్స్, పప్పు ధాన్యాలు లాంటివి తినడం మర్చిపోకూడదు.

బి12

వెగన్ డైట్ ఫాలో అయ్యేవాళ్లకు విటమిన్ బి12 సప్లిమెంట్ అవసరం రావొచ్చు. విటమిన్ బి12 యానిమల్ ఫుడ్స్‌లో ఎక్కువగా దొరుకుతుంది. విటమిన్ బి12 శరీరానికి అవసరమైన విటమిన్స్‌లో ఒకటి. వెగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్లు.. బి12 డెఫిషియన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఐరన్

శరీరానికి కావాల్సిన ఐరన్‌లో హెమీ ఐరన్, నాన్ హెమీ ఐరన్ అని రెండు రకాలుంటాయి. అయితే వెగన్ డైట్‌లో నాన్ హెమీ ఐరన్ మాత్రమే ఉంటుంది. హెమీ ఐరన్ యానిమల్ ఫుడ్స్‌లో ఎక్కువగా దొరుకుతుంది. వెగన్ డైట్‌లో సరైన ఐరన్ కావాలంటే.. సన్ ఫ్లవర్ గింజలు, ఎండు ద్రాక్ష, ఎండు మిర్చి, బ్రొకోలీ లాంటివి తినాలి.

క్యాల్షియం

పాల ఉత్పత్తుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. వెగన్లు డెయిరీ ప్రొడక్ట్స్ వాడరు. క్యాల్షియం కోసం ఆల్మండ్స్, సోయా బీన్స్ లాంటివి రెగ్యులర్‌‌గా తినాలి.

ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్

హార్ట్, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో బాగా దొరుకుతాయి. వెగన్లు చేపలు తినరు. కాబట్టి వాటికి బదులుగా వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి తీసుకోవాలి.

ఇదిలా ఉంటే పిల్లలపై వెగనిజం నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుందనేది కొందరి వాదన. పిల్లలకు చిన్న వయసులో శరీరం మెదడు కణాలను తయారు చేసుకుంటుంది . దీనికి ఎక్కువ మొత్తంలో ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్‌ అవసరమవుతాయి. అయితే మన శరీరం వాటిని సొంతంగా తయారు చేసుకోలేదు. జంతువుల నుంచి లభించే పాలు, ప్రొటీన్లతోనే అది సాధ్యం. పిల్లలకు సరైన రీతిలో ప్రొటీన్స్ అందించకపోతే శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉండదు. పోషకాహార లోపం వస్తుందని స్టడీలు చెప్తున్నాయి. కాబట్టి జాగ్రత్తలతో కూడిన వెగన్‌ డైట్ తీసుకోవడం ముఖ్యం.

First Published:  29 March 2024 6:00 AM IST
Next Story