వర్షంలో తడిచినా జుట్టు పాడవ్వకూడదంటే..
వర్షాకాలంలో అడపాదడపా వానలో తడవడం సహజం. అయితే అలా తడవడం వల్ల జుట్టు పాడవ్వడం, చుండ్రు ఏర్పడడం, జుట్టులో దురద వంటి సమస్యలొస్తాయి.
వర్షాకాలంలో అడపాదడపా వానలో తడవడం సహజం. అయితే అలా తడవడం వల్ల జుట్టు పాడవ్వడం, చుండ్రు ఏర్పడడం, జుట్టులో దురద వంటి సమస్యలొస్తాయి. అందుకే ఈ సీజన్‌లో జుట్టు కోసం తీసుకునే జాగ్రత్తల్లో కొన్ని మార్పులు చేయాలి. అదెలాగంటే..
చినుకులు పడి తల తడిచినప్పుడు మాడుపై ఉత్పత్తి అయ్యే సహజనూనెలు తొలగిపోయి మాడు జిడ్డుగా మారుతుంది. అంతేకాదు వాతావరణంలోని తేమ వల్ల తెలియకుండానే జుట్టు కాస్త తడిగా మారుతుంటుంది. దీనివల్ల తలపై మృతకణాలను పెరిగి చుండ్రు వస్తుంది. అందుకే వర్షంలో తడిసిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి జుట్టును పొడిగా ఆరబెట్టుకోవాలి.
ఈ సీజన్‌లో వారానికి మూడు సార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. నీళ్లు మరీ వేడిగా ఉండకుండా చూసుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు మాడుపై దువ్వెన లేదా బ్రష్‌తో సున్నితంగా రుద్దితే చుండ్రు వదిలిపోతుంది. మాడుపై రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
ALSO READ: జుట్టు రాలడాన్ని అరికట్టాలంటే ఈ ఆహారపదార్థాలు తీసుకోండి
ఈ సీజన్‌లో జుట్టుకి జెల్, వ్యాక్స్ వంటివి వాడకపోవడమే మంచిది. అవి మాడుపై మరింత జిడ్డుని పెంచుతాయి. కాబట్టి జుట్టుని వీలైనంత వరకూ పొడిగానే ఉంచాలి.
జుట్టుకి రోజూ నూనె పెట్టే అలవాటుంటుంది చాలామందికి. అయితే జుట్టు ఆరోగ్యానికి నూనె మంచిదే అయినా వర్షాకాలంలో మాత్రం ఈ అలవాటును కాస్త తగ్గించుకోవడం మంచిది. తలపై నూనెకు వాతావరణంలోని హ్యుమిడిటీ కూడా తోడయితే జుట్టు మరింత జిడ్డుగా మారుతుంది. తలలో దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో నూనెకు బదులు వాటర్ బేస్డ్ సీరమ్స్ వాడడం బెటర్.
తడిచిన జుట్టును కంట్రోల్ చేయడం కష్టం కనుక ఈ సీజన్‌లో జుట్టుని వీలైనంత వరకూ షార్ట్‌గా ఉంచుకుంటే బాగుంటుంది. అలాగే వర్షాకాలంలో హెయిర్ స్ట్రెయిట్‌నర్స్, కర్లర్స్, హెయిర్ డ్రయ్యర్స్ వాడకాన్ని కూడా తగ్గిస్తే మంచిది.