తిన్న తర్వాత ఇలా చేస్తే ఫిట్‌గా ఉండొచ్చు!
సాధారణంగా తిన్న తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయకూడదని చెప్తారు. కానీ, తిన్న తర్వాత చేయగలిగే కొన్ని యోగాసనాలు, వ్యాయామాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అంతేకాదు వీటిని చేయడం వల్ల తిన్నది త్వరగా అరిగి, గ్యాస్ట్రిక్ సమస్యల వంటివి తగ్గుతాయి కూడా.
సాధారణంగా తిన్న తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయకూడదని చెప్తారు. కానీ, తిన్న తర్వాత చేయగలిగే కొన్ని యోగాసనాలు, వ్యాయామాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అంతేకాదు వీటిని చేయడం వల్ల తిన్నది త్వరగా అరిగి, గ్యాస్ట్రిక్ సమస్యల వంటివి తగ్గుతాయి కూడా.
తిన్న తర్వాత చేసే యోగాను ‘ఆఫ్టర్ ఫుడ్ యోగా’ అంటారు. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి ఈ రకమైక యోగాసనాలు హెల్ప్ చేస్తాయి. సెలబ్రిటీలు పొట్ట పెరగకుండా ఉండేందుకు ఈ రకమైన యోగాను ఎక్కువగా ఫాలో అవుతుంటారు.
వజ్రాసనం
తిన్న తర్వాత చేయగలిగే ఆసనాల్లో వజ్రాసనం ఒకటి. మోకాళ్ళ మీద కూర్చుని వెన్నెముకను నిటారుగా ఉంచాకలి. పాదాల మడమలను పిరుదులు ఆనించి కూర్చోవాలి. చేతులను ఒకదానిపై మరొకటి పెట్టి తొడలపై ఉంచాలి. దీన్నే వజ్రాసనం లేదా డైమండ్ పోజ్ అంటారు. తిన్న తర్వాత కొన్ని నిముషాలు ఈ పోజ్‌లో కూర్చోవడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఈ పోజ్‌లో ఉన్నప్పుడు జీర్ణాశయంపై ఎలాంటి ఒత్తిడి పడదు. జీర్ణాశయం, ప్రేగులు రిలాక్స్‌డ్ పొజిషన్‌లో ఉంటాయి. అందుకే దీన్ని తిన్న తర్వాత కూడా చేయగలిగే వ్యాయామంగా చెప్తారు.
మలాసనం
తిన్న వెంటనే చేయగలిగే మరో ఆసనం మలాసనం. గొంతు కూర్చొని చేతులను నమస్కారం పొజిషన్‌లో పెట్టాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. తిన్న తర్వాత మూడు నిముషాలు ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే ఆహారం బాగా జీర్ణమవుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలకు కూడా ఈ ఆసనం మంచిది. ఈ ఆసనాన్ని గర్భిణులు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది జీర్ణ సమస్యలను, మలబద్దకాన్ని నివారించడంలో సాయపడుతుంది.
వాకింగ్
తిన్న తర్వాత చేయగలిగే మరో వ్యాయామం వాకింగ్. తిన్న వెంటనే పడుకోవడం, కూర్చోవడం వంటివి చేయకుండా ఐదు నిముషాల పాటు నడవడం ద్వారా పొట్టకండరాల్లో కదలికలు ఏర్పడి జీర్ణప్రక్రియ వేగవంతం అవుతుంది. తద్వారా జీర్ణసమస్యలు, మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు.
మార్చింగ్ ట్విస్ట్స్
తిన్న తర్వాత మార్చింగ్ ట్విస్ట్ వర్కవుట్ కూడా చేయొచ్చు. ముందుగా నిటారుగా నిల్చొని రెండు చేతులను కలిపి తల వెనుక పెట్టాలి. ఇప్పుడు కుడి మోకాలిని పైకి లేపుతూ ఎడమ మోచేతితో టచ్ చేసేందుకు ప్రయత్నించాలి. అలాగే ఎడమ మోకాలని కుడి మోచేతితో టచ్ చేయాలి. ఇలా మెల్లగా ఒక నిముషం పాటు చేయొచ్చు. ఈ వ్యాయామం అరుగుదలను స్పీడ్ చేస్తుంది.