మంకీపాక్స్‌ను కనిపెట్టండిలా..
మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తున్నప్పుడు ఇలా ప్రకటిస్తారు.
దేశంలో ఇంతవరకు 9 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. చాపకింద నీరులా మంకీపాక్స్ మెల్లగా వ్యాపిస్తోంది. దీంతో ప్రమాదం లేదని వైద్యులు చెప్తున్నప్పటికీ.. ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఈ వైరస్ 78 దేశాలకు వ్యాపించి, 18 వేలమందికి సోకింది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఐరోపా, అమెరికా దేశాలపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తున్నప్పుడు ఇలా ప్రకటిస్తారు. ఈ సందర్భంలో మంకీపాక్స్‌ను గుర్తించడం, రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.
మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధి బారిన పడే ముప్పును తగ్గించుకునేందుకుగాను ముఖ్యంగా లైంగిక దూరాన్ని, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని బ్రిటిష్ వైద్యులు సూచిస్తున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పట్టొచ్చు.
మంకీ పాక్స్ మొదటి దశలో జ్వరం, తలనొప్పి, వాపు, నడుం నొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత, చర్మంపై దద్దుర్లు లేదా పొక్కులు కనిపిస్తాయి. ముందు చర్మం ఎర్రగా కందినట్టు కనిపిస్తుంది. తర్వాత పొక్కులు వస్తాయి. అవి బొబ్బలుగా మారతాయి. మెల్లగా అవి ఎండిపోయి, పైన పొక్కులు ఊడిపోతాయి.