పగటి పూట నిద్ర.. ఆ వ్యాధిపేరు హైపర్ సోమ్నియా..
పగటి పూట కూడా మత్తుగా ఉంటే కచ్చితంగా దాని గురించి ఆలోచించాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు.
పగటిపూట నిద్ర, పనికి చేటు కదరా అంటారు. పనిలో పడితే ఎవరికీ పెద్దగా నిద్ర గుర్తుకు రాదు. కానీ కాస్త ఖాళీ దొరికినా పగటిపూట పడుకోవాలనిపిస్తే, రాత్రుళ్లు నిద్రపోతున్నా పగటిపూట కూడా నిద్రవస్తుంటే.. దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అదో వ్యాధి, ఆ వ్యాధిపేరు హైపర్ సోమ్నియా. సహజంగా రాత్రుళ్లు నిద్రపట్టనివారు పగటిపూట నిద్రపోవాల్సిందే. కానీ రాత్రి కంటినిండా నిద్రపట్టినా.. పగటి పూట కూడా మత్తుగా ఉంటే కచ్చితంగా దాని గురించి ఆలోచించాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు.
నూటికి ఆరుగురు ఏదో ఒక సమయంలో హైపర్ సోమ్నియాతో బాధపడి ఉంటారని అంచనా వేస్తున్నారు నిపుణులు. పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు ఎక్కువగా ఈ లక్షణాలు ఉంటాయి. రాత్రిపూట నిద్రపోయినా కూడా పగటి వేళ మెలకువగా ఉండలేరు, నిద్ర కళ్లమీదే ఉంటారు. ఏ కాస్త అవకాశం దొరికినా నడుం వాల్చేస్తారు.
పగటిపూట నిద్రపోతే తప్పేంటి..?
అవకాశం ఉన్నప్పుడు నిద్రపోతే తప్పులేదు, కానీ పగటిపూట అదే పనిగా నిద్రపోవాలనిపిస్తుంటే మాత్రం జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుంది. టీనేజ్ వయసులో ఉన్నవారు ఎక్కువగా హైపర్ సోమ్నియాకు గురవుతుంటారని తెలుస్తోంది. దీనివల్ల వారి చదువుపై తీవ్ర ప్రభావం పడుతుంది, తద్వారా కెరీర్ లో వారు రాణించలేకపోవచ్చు. సోమరులు అనే ముద్రపడుతుంది.
లక్షణాలేంటి..?
పగటిపూట నిద్రపోవాలనిపించడం, ఉదయం లేచినా నిద్రమంపు వదలకపోవడం, నీరసంగా, నిస్సత్తువగా ఉండటం.. ఆందోళన, చిరాకు, మానసిక అశాంతి, మాటల్లో చేతల్లో చురుకుదనం లేకపోవడం, జ్ఞాపక శక్తి సమస్యలు, తలనొప్పి, ఆకలి లేకపోవడం.. ఇవీ ప్రాథమికంగా హైపర్ సోమ్నియా లక్షణాలు.
నివారణ మార్గాలు..
ప్రతి రోజు రాత్రి ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. నిద్ర లేచిన వెంటనే కాఫీ, టీ, చాక్లెట్లు తీసుకోవడం అలవాటు చేసుకోకూడదు. హుషారు కోసమే వాటిని తీసుకుంటున్నామని అనుకున్నా.. నాడీ వ్యవస్థపై అవి తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. మద్యం, పొగతాగటం, పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం మానేయాలి. వైద్యులను సంప్రదించి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. హైపర్ సోమ్నియాను అంత తేలిగ్గా తీసుకోకూడదని చెబుతున్నారు వైద్యులు. ఎంత త్వరగా దాన్ని నయం చేసుకోగలిగితే, జీవితంలో అంత ముందుకుపోవచ్చని సలహా ఇస్తున్నారు.