Telugu Global
Health & Life Style

అయోడిన్ లోపం వల్ల ఏం జరుగుతుంది? తీసుకోవల్సిన ఆహారం ఏమిటి?

గర్భం ధరించే స్త్రీలకు రోజులకు 150 మైక్రో గ్రాముల అయోడిన్ అవసరం పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గర్భం ధరించిన స్త్రీలు, పాలిచ్చే తల్లులకు అయోడిన్ అవసరం ఎక్కువగా ఉంటుంది.

అయోడిన్ లోపం వల్ల ఏం జరుగుతుంది? తీసుకోవల్సిన ఆహారం ఏమిటి?
X

సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే మన శరీరానికి అయోడిన్ ఎంతో ముఖ్యం. మనం తినే ఆహారం ద్వారా అయోడిన్ శరీరంలో చేరుతుంది. అయోడిన్ లోపం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మన దేశంలో అయోడిన్ లోపం ఎక్కువగా ఉందని భావించే.. ఉప్పులో అయోడిన్‌ను చేర్చి అమ్మడం మొదలు పెట్టారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి కూడా ఉన్నది. అయితే, ఇటీవల కాలంలో హైబీపీ ఎక్కువ అవుతుండటంతో ఉప్పు తినడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఉప్పు తగ్గిస్తే అయోడిన్ లోపం రాదా అని పలువురికి సందేహాలు ఉన్నాయి. అయితే, కేవలం ఉప్పు వల్లే మన శరీరంలోకి అయోడిన్ చేరదు. అయోడిన్ సమతుల్యాన్ని కాపాడే అనేక ఇతర ఆహార పదార్థలు కూడా ఉన్నాయి.

అయోడిన్ అనేది మన హార్మోన్ల పని తీరుకు చాలా ముఖ్యమైనది. థైరాయిడ్ సరిగా పని చేయాలంటే అయోడిన్ లోపం ఉండకూడదు. ఈ సూక్ష్మ పోషకం లోపిస్తే థైరాయిడ్ పని తీరులో చాలా మార్పులు వస్తాయి. హైపో థైరాయిడిజం అనే సమస్య మొదలవుతుంది. ఈ సమస్య వస్తే మహిళలు గర్భం ధరించడం కష్టం అవుతుంది. హైపో థైరాయిడిజానికి సంబంధించిన చికిత్స చేయాల్సి వస్తుంది. అయోడిన్ లోపిస్తే పిల్లలు కనడం కష్టం అవుతుంది కాబట్టే దీనిని నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

అయోడిన్ లోపం వల్ల వచ్చే థైరాయిడ్ సమస్య కేవలం మహిళల్లోనే వస్తుందని చాలా మందికి అపోహ ఉన్నది. అయితే పురుషుల్లో కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అయోడిన్ లోపం వల్ల అవసరమైన స్థాయిలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలం అవుతుంది. దీని వల్ల గర్భధారణకు అవసరమైన స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు. అయితే అయోడిన్ అధికంగా ఉన్నా కూడా సమస్యలు ఏర్పడుతాయి. అంగస్తంభన, స్పెర్మాటోజెనిక్ అసాధారణతలు, స్పెర్మ్ చలనశీలత సమస్యలు, తక్కువ స్పెర్మ్ కౌంట్ వంటివి ఏర్పడుతాయి. అందుకే వైద్యులను సంప్రదించి మోతాదు మేరకే అయోడిన్‌ను తీసుకోవాలి.

గర్భం ధరించే స్త్రీలకు రోజులకు 150 మైక్రో గ్రాముల అయోడిన్ అవసరం పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గర్భం ధరించిన స్త్రీలు, పాలిచ్చే తల్లులకు అయోడిన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. రోజుకు 50 మైక్రో గ్రాముల కంటే తక్కువ తీసుకుంటే వారికి అయోడిన్ లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆహారం ద్వారా తీసుకున్న అయోడిన్.. గర్భాశయంలోని అండాలు, ఎండోమెట్రియం పొర గ్రహిస్తుంది. పరోక్షంగా అండోత్సర్గానికి (ovulation) అయోడిన్ ప్రోత్సాహకంగా పని చేస్తుంది.

అయోడిన్ మన శరీరంలోకి కేవలం ఉప్పు ద్వారానే వెళ్లదు. సముద్రపు చేపలు, రొయ్యలు, గుడ్లు, పాలు, చీజ్, పెరుగు, చికెన్ ద్వారా కూడా అయోడిన్‌ను మన శరీరం గ్రహిస్తుంది. కాబట్టి ప్రతీ రోజు వీటిలో ఏదో ఒకటి మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిని తరచూ తినడం వల్ల అయోడిన్ లోపం రాకుండా ఉంటుంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేసుకోవడం ద్వారా అయోడిన్ లోపం ఉందో లేదో తెలుసుకుంటూ.. వైద్యుల సూచనలు పాటించాలి.

First Published:  26 Nov 2022 5:07 PM IST
Next Story