గోళ్లు కొరికే అలవాటును దూరం చేసుకోవడానికి ఇలా చేయండి
మనిషి అసహనం, నిరాశ, ఒంటరితనం, ఏకాగ్రత లేని సమయంలో గోళ్లు ఎక్కువగా కొరుతుంటారు. ఉద్దేశపూర్వకంగా కొరకకపోయినా.. ఈ అలవాటు చేటు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు
మనిషన్నాక ఎన్నో అలవాట్లు ఉంటాయి. అవి మంచివి అయితే పర్వాలేదు. కానీ చెడు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. మద్యం, సిగరెట్లు, గుట్కా వంటివి వ్యసనాలు. కానీ మనిషి తెలిసో తెలియకో కొన్ని పనులు చేస్తుంటాడు. టెన్షన్ వచ్చినప్పుడో.. ఏదో పరధ్యానంలో ఉన్నప్పుడో చాలా మంది గోళ్లు కొరుకుతుంటారు. గోళ్లు కొరికే వాళ్లకు, చూసే వాళ్లకు అది సాధారణమైన విషయంగానే అనిపించవచ్చు. కానీ ఈ అలవాటు వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
గోళ్లు కొరుక్కోవడం కూడా ఓ రోగమే అని వైద్య నిపుణులు తేల్చారు. దీన్ని వైద్య పరిభాషలో ఒనికోఫిజియా (Onychophagia) అంటారు. ఈ లక్షణం ఎక్కువగా చిన్న పిల్లల్లో కనపడుతుంది. అయితే చిన్న పిల్లలు పాల కోసం నోట్లో వేలు పెట్టుకోవడం అలవాటు అయి.. ఆ తర్వాత పాలు మానిపిస్తే గోళ్లు కొరకడం మొదలు పెడతారు. కానీ, పెద్దవాళ్లలో మాత్రం ఈ గోళ్లు కొరికే అలవాటు టెన్షన్ వల్లే ఎక్కువగా వస్తుందని వైద్యులు చెప్తున్నారు. గోళ్లు కొరికితే ప్రమాదం ఏమీ లేదని చాలా మంది భావిస్తారు. కానీ గోళ్లలో సార్మేనేలా, క్లేబ్సిలా అనే హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. గోళ్లు కొరికితే నోటి ద్వారా నేరుగా శరీరంలోకి వెళ్లి ఫుడ్ పాయిజన్ అవుతంది అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
మనిషి అసహనం, నిరాశ, ఒంటరితనం, ఏకాగ్రత లేని సమయంలో గోళ్లు ఎక్కువగా కొరుతుంటారు. ఉద్దేశపూర్వకంగా కొరకక పోయినా.. ఈ అలవాటు చేటు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు ఈ గోళ్లు కొరికే అలవాటును దూరం చేసుకోవడం మంచిది. అందుకే కొన్ని టిప్స్ పాటిస్తే ఈ అలవాటు మానేయడం పెద్ద కష్టం కాదని కూడా వైద్యులు చెబుతున్నారు.
ఒక మనిషి ఏ సమయంలో, ఎలాంటి సందర్భాల్లో గోళ్లు కొరుకుతున్నారో కుటుంబ సభ్యులు మొదటిగా గుర్తించాలి. సదరు వ్యక్తికి అలాంటి సిట్యుయేషన్ ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఒత్తిడికి గురయ్యే వారి చేతికి స్ట్రెస్ రిలీఫ్ బాల్ ఇవ్వడం వల్ల చాలా వరకు గోళ్లు కొరికే అలవాటు తగ్గుతుంది. అంతే కాకుండా వాకింగ్ చేయడం, ఆటలు ఆడటం వల్ల... నచ్చిన పనులు చేయడం వల్ల గోళ్లు కొరికే అలవాటు పోతుంది. చేతులకు పని ఎక్కువగా చెప్పడం వల్ల ఈ దురలవాటును తగ్గించవచ్చు. గోళ్లు కొరికే అలవాటు ఉన్న వాళ్లు హార్రర్, యాక్షన్ సినిమాలు చూడకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు గోళ్లు కత్తిరించుకోవడం వల్ల కూడా ఈ అలవాటు నుంచి బయటపడవచ్చు.
ఇన్ని చేసినా గోళ్లు కొరికే అలవాటు మానలేకపోతే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గోళ్లు కొరికే అలవాటు ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకొని రావొచ్చు.