Telugu Global
Health & Life Style

వేసవిలో జీర్ణ వ్యవస్థ సమస్యల నివారణకు..

సమ్మర్‌లో సహజంగానే జీర్ణక్రియ రేటు తగ్గుతుంది. కాబట్టి ఆలస్యంగా జీర్ణమయ్యే నాన్‌ వెజ్‌కు దూరంగా ఉండడం మంచిది. సమ్మర్‌లో ఆల్కహాల్‌ తీసుకోవటం కూడా మంచిది కాదు.

వేసవిలో జీర్ణ వ్యవస్థ సమస్యల నివారణకు..
X

భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగి అడుగు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి. విపరీతంగా పెరుగుతున్న వేడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. వేసవిలో దాహం తీర్చుకొనేందుకు అనారోగ్యకరమైన పానీయాలను మరో ఆలోచన లేకుండాతాగేస్తాం. ఆకలి వేస్తే ఈ ఒక్కసారే కదా అనుకుంటూ బయటి పదార్ధాలు తీసుకుంటాం. వీటివల్ల మిగతారోజుల్లోకంటే వేసవిలో సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అసలే ఈ సమయంలో డీ హైడ్రేషన్ ప్రమాదం ఎక్కువ. ఇక ఇలాంటి సమయంలో విరోచనాలు వంటివి ఏమన్నా వస్తే శరీరం త్వరగా నీటిని కోల్పోయి ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటుంది. అంతే కాదు వేసవిలో కడుపు మరియు ప్రేగులలోని లైనింగ్ వాపు(గ్యాస్ట్రోఎంటెరిటిస్) వచ్చే అవకాశం ఉంది. ఇది విరేచనాలు, వాంతులకు దారి తీస్తుంది. సాధారణంగా ఈ లక్షణాల కలయిక బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించవచ్చు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

వేసవిలో వచ్చే ఏ సమస్య అయినా తగినంత నీటిని తీసుకోకపోవడంతోనే మొదలవుతుంది. తక్కువగా నీటిని తీసుకోవటం వల్ల వడదెబ్బ జ్వరంతో పాటు గ్యాస్ట్రోఇంటెస్టినల్ వ్యాధులకు దారి తీస్తుంది. ఇలాంటి సమయంలో తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో తీసుకోవాలని, పచ్చిగా ఉండే ఆహారం, తక్కువగా ఉడికించే ఆహారానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక చక్కెర కూడా మితంగానే తీసుకోవాలి. ఎందుకంటే శరీరంలో చక్కెర కంటెంట్ పెరిగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

సమ్మర్‌లో టీ, కాఫీలు శరీర ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుతాయి. దీంతో శరీరంలో డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాగే మసాల ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సమ్మర్‌లో సహజంగానే జీర్ణక్రియ రేటు తగ్గుతుంది. కాబట్టి ఆలస్యంగా జీర్ణమయ్యే నాన్‌ వెజ్‌కు దూరంగా ఉండడం మంచిది. సమ్మర్‌లో ఆల్కహాల్‌ తీసుకోవటం కూడా మంచిది కాదు. మందు వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

First Published:  3 May 2024 5:56 AM GMT
Next Story